Insurance Murder: బీమా సొమ్ము కోసం చెల్లెల్ని చంపేశాడు.. ప్రకాశం జిల్లాలో ఘోరం.. పోస్టుమార్టంలో వెలుగు చూసిన నేరం
Insurance Murder: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడాది తర్వాత హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తోడబుట్టిన అన్నే చెల్లెల్ని కిరాతకంగా హత్య చేసి యాక్సిడెంట్‌గా నమ్మించాడు. చివరకు పోస్టుమార్టంలో హత్య వెలుగు చూసింది.
Insurance Murder: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పుల పాలైన యువకుడు చెల్లెలు పేరిట ఉన్న బీమా డబ్బులపై కన్నేశాడు. పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత హత్య వ్యవహారం వెలుగు చూడకుండా పోస్టుమార్టం నివేదికను కూడా మార్చేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో హత్య వెలుగు చూసింది. దాదాపు ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు.

డబ్బు కోసం సొంత చెల్లెలికి మత్తు మందు ఇచ్చి, దిండుతో నొక్కి హత్య చేసి ఆ తర్వాత కారు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. పోస్టుమార్టంలో హత్య వ్యవహారం దొరకకుండా ఆస్పత్రి సిబ్బందికి లంచం కూడా ఇచ్చాడు. చివరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నిందితుడి ఆట కట్టించారు.
సరిగ్గా ఏడాది క్రితం ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల దర్యాప్తులో యువతి పేరి భారీగా ఇన్సూరెన్స్ ఉండటం గుర్తించి కేసు దర్యాప్తును జాగ్రత్తగా కొనసాగించారు. 2024 ఫిబ్రవరి 4న ఒంగోలు నుంచి వస్తున్న కారు పొదిలి మండలం కాటూరివారి పాలెం వద్ద ప్రమాదానికి గురైంది. కాటూరి వారి పాలెం వద్ద రోడ్డు పక్కన చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాల పాటి సంధ్య (24) చనిపోయారు.
కారు నడుపుతున్న ఆమె సోదరుడు అశోక్ గాయప డ్డాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టంలో గొంతు పీసకడంతో ఊపిరి అందక సంధ్య ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టు మార్టం నివేదికలో తేలింది. చనిపోయే నాటికి సంధ్య పేరిట రూ. 1.13 కోట్ల బీమా పాలసీలు ఉన్నాయి. వాటికి నామినీగా అన్న అశోక్ ఉన్నాడు.
పునుగోడు గ్రామానికి చెందిన సంధ్యకు పెళ్లైన తర్వాత పిల్లలు లేకపోవడంతో భర్తతో విడాకులు తీసుకుంది. పుట్టింట్లో ఉంటున్న ఆమె పేరిట రెండు సాధారణ బీమా పాలసీలు ఉన్నాయి. 2023 నవంబరులో రూ.70 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకొన్నారు. ఈ పాలసీలు అన్నింటికీ అశోక్ నామినీగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అప్పుల పాలైన అశోక్ వాటిని తీర్చేందుకు చెల్లెలి పేరుతో ఉన్న బీమా పాలసీ డబ్బుల్ని దక్కించుకోవాలనుకున్నాడు.
2024 ఫిబ్రవరిలో సంధ్య అస్వస్థతకు గురి కావడంతో ఒంగోలులోని ఓ స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తున్న సమయంలో మంచి నీటిలో నిద్రమాత్రలు కలిపాడు. కాటూరి వారిపాలెం వద్దకు వచ్చేసరికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత దిండుతో చెల్లెలి గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి న్నట్లుగా ప్రమాదాన్ని చిత్రీకరించాడు. పోలీసులు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హత్య జరిగిన తర్వాత ఆ విషయాన్ని ఆశోక్ స్నేహితుడు మాలకొండారెడ్డితో చెప్పాడు. మత్తుమందు ఇచ్చినట్లు పోస్టు మార్టం నివేదికలో తెలిస్తే దొరికిపోతావని మాలకొండారెడ్డి అశోక్‌కు సూచించాడు. దీంతో అశోక్ పొదిలి ఆసుపత్రిలో పనిచేసే యూసుఫ్‌తో మాట్లాడి శవపరీక్ష కోసం సీజ్ చేసిన సంధ్య ఆవయవాలను మార్చేశాడు. దీనికి అతనికి రూ.3 లక్షలు ఇచ్చాడు.
సంధ్య మృతి కేసులో పోలీసులు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతుండటంతో యూసుఫ్ అవయవాలు మార్చేసినా హత్య మిస్టరీ వీడిపోయింది. గొంతు నులిమి చంపినట్టు నిర్దారణ కావడంతో అశోక్‌ను విచారించడంతో హత్య కేసు బయటపడింది. అతనికి సహకరించిన మాలకొండా రెడ్డి, యూసుఫ్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు.