ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 19 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
తల్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎర్రబాలెం గ్రామానికి చెందిన నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ పది రోజుల క్రితం తన మొదటి భార్యతో కలిగిన కుమారుడు భూక్య మంగ్యా నాయక్ (19)ను హత్య చేసి, కాలువ పక్కన మృతదేహాన్ని పాతిపెట్టాడు.
పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
"నిందితుడు వెంకటేశ్వర్లు తన మొదటి భార్య కోటేశ్వరి కుమారుడు మంగ్యా నాయక్ (19)ను హత్య చేసి, మృతదేహాన్ని వ్యవసాయ పొలంలో పాతిపెట్టాడు. ఎంఆర్‌ఓ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటేశ్వర్లు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోస్టుమార్టం, తదుపరి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి" అని పోలీసులు తెలిపారు.
ఆస్తి వివాదం, తల్లి నడవడికపై అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి కోటేశ్వరి తన మాజీ భర్త గతంలో తమ కుమారుడిని చంపుతానని బెదిరించాడని ఆరోపించింది.
"మాకు 2006లో పెళ్లయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా నడవడికపై అనుమానంతో నా కొడుకుల్లో ఒకరిని చంపేశాడు. తర్వాత మేము విడిపోయాం. నేను నా పెద్ద కొడుకును కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను. మేము విడిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి తగాదాల విషయంలో నా కొడుకును చంపుతానని గతంలోనే హెచ్చరించాడు. అతనికి తన కుటుంబ సభ్యులను హత్య చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు కూడా తీసుకున్నాడు. నాకు న్యాయం కావాలి" అని ఆమె పోలీసులకు మొరపెట్టుకుంది.
వెంకటేశ్వర్లు తర్వాత మరొక వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారని, అతనికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా దర్యాప్తు సమయంలో ఆగ్రహించిన స్థానికులు పోలీసు బృందంపై దాడి చేశారు. దర్యాప్తునకు నాయకత్వం వహించిన ఇన్‌స్పెక్టర్ సురేష్ గాయపడ్డారు. గుంపును నియంత్రించడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.