బాధితురాలు శివలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన శెట్టిపల్లి విశ్వనాథరెడ్డి.. తన భార్య శివలక్ష్మికి 2024 అక్టోబర్ 29న ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె పేగుకు రంధ్రం పడింది. ఆమెకు ఇన్‌ఫెక్షన్ సోకింది. దీని గురించి తెలుసుకున్న విశ్వనాథరెడ్డి కుటుంబం.. ఆపరేషన్ చేసిన వైద్యురాలు ఇనయరాణిని ప్రశ్నించారు. అయితే ఆమె అదేమీ కాలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
రెండు రోజుల తరువాత స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పరీక్షించిన తరువాత ఇన్‌ఫెక్షన్ సోకిందని, హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. మళ్లీ విశ్వనాథరెడ్డి సెకెండ్ ఒపినియన్ కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు కూడా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వారి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సుమారు రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు. విశ్వనాథరెడ్డి భార్య నరకం చూసింది. రూ.15 లక్షలు ఖర్చు అయింది. ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది.
ఈ క్రమంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కడప కలెక్టరేట్‌లో నిర్వహించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చి విశ్వనాథరెడ్డి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతి పత్రం అందజేశాడు. అనంతరం అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్ అప్రమత్తమై ఆయన వద్ద నుంచి పెట్రోల్ సీసాను లాక్కున్నారు. అక్కడే ఉన్న ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఆయనను పట్టుకున్నారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఆయనను పీజీఆర్ఎస్ జరిగే హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. కడప వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
ఈ సందర్భంగా బాధితుడు విశ్వనాథరెడ్డి తమకు న్యాయం కావాలని 11 సార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి (డీఎంఎస్‌వో) డాక్టర్ నాగరాజు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని వాపోయారు. డీఎంహెచ్‌వో, ప్రొద్దుటూరు ఆసుపత్రి వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు డబ్బులు అవసరం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని, తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని బాధితురాలు శివలక్ష్మి డిమాండ్ చేశారు. దీనిపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని, సమస్యను మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ స్పందిస్తూ.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఎంహెచ్‌వో నాగరాజు స్పందిస్తూ.. గతంలోనే ఆ డాక్టర్‌పై స్పెషల్ కమిటీతో విచారణ జరిపామని, కమిటీ నివేదికను ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమపై ఆరోపణలు చేస్తే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )