Krishna District Crime : మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు.. సీన్ కట్ చేస్తే..-man cheating young woman in the name of marriage in krishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krishna District Crime : మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు.. సీన్ కట్ చేస్తే..

Krishna District Crime : మాయ మాట‌లతో యువ‌తిని పెళ్లాడిన వ్య‌క్తి.. అప్పటికే ఇద్దరు పిల్లలు.. సీన్ కట్ చేస్తే..

HT Telugu Desk HT Telugu
Dec 26, 2024 09:49 AM IST

Krishna District Crime : కృష్ణా జిల్లాలో మోస‌పూరిత ఘ‌ట‌న జరిగింది. రైల్వే ఎస్ఐని అంటూ యువ‌తికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికే పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా యువ‌తిని మోసం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించి యువ‌తి అక్క వ‌ద్ద డ‌బ్బులు కాజేశాడు.

కృష్ణా జిల్లాలో మోస‌పూరిత ఘ‌ట‌న
కృష్ణా జిల్లాలో మోస‌పూరిత ఘ‌ట‌న

కృష్ణా జిల్లా కొల్లూరులో ఓ వ్యక్తి మోసం బయటపడింది. యువ‌తి ఫిర్యాదు మేర‌కు ఎస్ఐ ఏడుకొండలు మేడేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసు న‌మోదు చేశారు. ఎస్ఐ ఏడుకొండ‌లు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొల్లూరుకు చెందిన బాధిత యువ‌తికి 2022లో ఆమె బంధువుల వివాహ వేడుక‌ల్లో నిందితుడు వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌రిచ‌యం అయ్యాడు. తన పేరు మేడేప‌ల్లి పృథ్వీరాజ్ చౌద‌రి అని, విజ‌య‌వాడ‌లో రైల్వే ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారనని పరిచయం చేసుకున్నాడు.

yearly horoscope entry point

పరిచయం అలా..

తాను అవివాహితుడిన‌ని న‌మ్మ‌బ‌లికి ఆ యువ‌తితో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. నిందితుడు లేనిపోని ఆశ‌లు చూపి యువ‌తిని నమ్మించాడు. నిందితుడిని ఆమె పూర్తిగా న‌మ్మింది. క‌ట్నం అవ‌స‌రం లేకుండా వివాహం చేసుకుంటాన‌ని చెప్పాడు. ఈ విష‌యం త‌న ఇంట్లో చెబితే వారు క‌ట్నం లేక‌పోతే పెళ్లి వ‌ద్దంటార‌ని, వారికి క‌ట్నం ముఖ్య‌మ‌మ‌ని చెప్పాడు.

పెద్దల అంగీకారంతో..

ముందు వివాహం చేసుకుని ఆ తరువాత వారిని మెల్ల‌గా ఒప్పిస్తాన‌ని, అంతా స‌ర్థుకున్న త‌రువాత ఇంటికి తీసుకెళ్తాన‌ని ఆ యువ‌తిని న‌మ్మించాడు. నిందితుడు చెప్పినవ‌న్నీ విని, నిజ‌మే అనుకుని న‌మ్మింది. ఆ యువ‌తి నిందితుడి ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించింది. ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యులు, పెద్ద‌ల‌తో మాట్లాడారు. కుమార్తె పెళ్లికి సిద్ధ‌ప‌డ‌టంతో వారు కూడా అందుకు అంగీక‌రించారు. ఆగ‌స్టు 18న వివాహం చేసుకున్నాడు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని..

బాధిత యువ‌తి అక్క‌ కుమారుడికి ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వేయిస్తాన‌ని రూ.2.60 ల‌క్ష‌లు, కుమార్తెకు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వారి దేవ‌స్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని రూ.2 లక్ష‌లు కాజేశాడు. ఈ క్ర‌మంలో నిందితుడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. బాధిత యువ‌తి, ఆమె కుటుంబ స‌భ్యులు ఆరా తీశారు.

అసలు విషయం తెలిసి..

దీంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ కుటుంబ స‌భ్యులు అవాక్కైయ్యారు. నిందితుడు సొంతూరు కృష్ణా జిల్లా, నాగాయ‌లంక మండ‌లం, గ‌ణ‌పేశ్వ‌రం అని బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న‌కు అంత‌కుముందే వివాహం అయింది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. భార్యా పిల్ల‌ల‌తో గ‌ణ‌పేశ్వ‌రంలో ఉంటున్నాడు.

మోసపోయామని తెలిసి..

నిందితుడి సామాజిక వ‌ర్గం కూడా మార్చి చెప్పాడు. ఆయ‌న ఒక సామాజికి వ‌ర్గానికి చెందిన‌వాడైతే, బాధిత కుటుంబం వ‌ద్ద మరో సామాజికవ‌ర్గ‌మ‌ని చెప్పాడు. దీంతో బాధిత మ‌హిళ తాను మోసపోయాన‌ని ల‌బోదిబోమంటుంది. పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదు చేశారు. నిందితుడు వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసు న‌మోదు చేశామ‌ని కొల్లూరు ఎస్ఐ ఏడుకొండ‌లు తెలిపారు.

(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జజరాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner