Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం, ప్రేమ పేరుతో వెంట‌పడి, పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్యకు పురిగొల్పాడు..-man chased her in the name of love and forced her to commit suicide in order to get married ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం, ప్రేమ పేరుతో వెంట‌పడి, పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్యకు పురిగొల్పాడు..

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఘోరం, ప్రేమ పేరుతో వెంట‌పడి, పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్యకు పురిగొల్పాడు..

HT Telugu Desk HT Telugu
Published Feb 07, 2025 09:33 AM IST

Guntur Crime: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వెంట‌పడి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు.. తీరా పెళ్లి చేసుకోమ‌నేస‌రికి చేతిని చాకుతో కోసి, ఎలుక‌ల మందు ఇచ్చి ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్య చేసుకోమన్నాడు...
పెళ్లి చేసుకోమంటే ఆత్మహత్య చేసుకోమన్నాడు... (HT Telugu)

Guntur Crime:   గుంటూరు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువ‌తి వెంట‌ప‌డ్డాడు ఒక యువ‌కుడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. తీరా పెళ్లి చేసుకోవాల‌ని యువ‌తి కోరితే, తాను ప్ర‌భుత్వ ఉద్యోగిని, త‌న‌కు ఎక్కువ క‌ట్నం వ‌స్తుంద‌ని అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోక‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌ని యువ‌కుడికి బాధిత యువ‌తి స్ప‌ష్టం చేసింది. దీంతో యువ‌తి చేతిని చాకుతో కోసి, తిన‌మ‌ని ఎలుక‌ల మందు ఇచ్చి ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పాడు. 

ప్రేమికుడు దక్క‌డ‌ని భావించిన యువ‌తి ఆత్మ‌హత్య యత్నానికి పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న‌ యువ‌తి త‌ల్లిదండ్రులు స‌కాలంలో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. బాధిత యువ‌తి ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్ర‌త్తిపాడు మండ‌లంలోని ఒక గ్రామంలో యువ‌తి డిగ్రీ చ‌దివింది. ఆమెకు ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే రోజుల్లో కార‌సాల రాజారావు అనే యువ‌కుడు ప్రేమించాడు. ఆమె వెంట‌ప‌డి వేధించేవాడు.

ఆమె విముఖ‌త వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ ప్రేమ పేరుతో వేధింపులు ఆప‌లేదు. అయితే ఆమెకు పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పేవాడు. అత‌డి మాయ మాట‌లను యువ‌తి న‌మ్మింది. దీంతో రాజారావుని ప్రేమ‌ను యువ‌తి అంగీక‌రించింది. పెళ్లి ప్ర‌స్తావ‌న రాగానే ఏదైనా ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చేవాడు.

ఐదేళ్ల క్రితం రాజారావుకు స‌చివాల‌య ఉద్యోగం వ‌చ్చింది. పెళ్లి చేసుకోమ‌ని ప్రియురాలు కోరితే, ఇద్ద‌రం జీవితంలో స్థిర‌ప‌డ్డాక పెళ్లి చేసుకుందామ‌ని ప్లేట్ ఫిరాయించాడు. ఈ క్ర‌మంలో ఆమె చ‌దివే కాలేజీకి త‌ర‌చూ వెళ్లేవాడు. ఇద్ద‌రూ సెల్‌ఫోన్‌లో రెగ్యుల‌ర్‌గా మాట్లాడుకునేవారు. ఇద్ద‌రూ క‌లిసి తిరిగేవారు. అయితే యువ‌తి గ‌తేడాది గుంటూరులోని ఒక క్లినిక్‌లో ఉద్యోగంలో చేరింది. రాజారావు అక్క‌డికి కూడా త‌ర‌చూ వెళ్లేవాడు. ఇద్ద‌రూ మాట్లాడుకునేవారు. అయితే పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చే స‌రికి, ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకునేవాడు.

అయితే గ‌త నెల‌లో యువ‌తి పెళ్లి గురించి గ‌ట్టిగా నిలదీసింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు మాయ‌మాట‌ల‌తో న‌మ్మిస్తూ వ‌చ్చిన ప్రేమికుడు, అప్పుడు త‌న మ‌న‌సులో అనుకున్న‌ది చెప్పేశాడు. త‌న‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఉంద‌ని, దానివ‌ల్ల త‌న‌కు ఎక్కువ క‌ట్నం వ‌స్తుంద‌ని, త‌ల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోవ‌డం లేద‌ని తేల్చి చెప్పాడు. 

దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వులు ప్రారంభ‌మైయ్యాయి. ఈ క్ర‌మంలో గ‌త నెల 15న ప్రేమికుడు రాజారావు, ప్రేమికురాలు ప‌ని చేసే క్లీనిక్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ పెళ్లి విష‌య‌మై మ‌ళ్లీ ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. పెళ్లి చేసుకోక‌పోతే త‌న‌కు చావే శ‌ర‌ణ్య‌మ‌ని ప్రేమికురాలి స్ప‌ష్టం చేసింది.

దీంతో త‌న‌తో తెచ్చుకున్న చాకుతో ఆమె చేతిని కోసి, ఎలుక‌ల మందు పేస్టు ప్యాకెట్ల‌ను యువ‌తికి ఇచ్చి ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పాడు. ఎలుక‌ల మందు తిన్నాక త‌న‌కు మెసేజ్ చేయాల‌ని ప్రేమికుడు రాజారావు అక్క‌డి నుంచి వెళ్లి పోయాడు. ప్రేమికుడు చెప్ప‌న‌ట్లే, ఆమె ఎలుక‌ల మందు తిన్నాక మెసేజ్ పెట్టింది. 

అనంత‌రం కొద్ది సేప‌టికే ఆమె అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లి పోయింది. అయితే ప్రియురాలు పంపిన మెసేజ్‌ను ప్రియుడు రాజారావు, ఆమె బంధువైన మ‌హిళ‌కు పంపించాడు. ఆమె యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చింది. దీంతో వెంట‌నే యువ‌త‌ని గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వైద్యం అంది కోలుకున్న త‌రువాత బాధిత యువ‌తి జ‌రిగిన విష‌యాల‌ను త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీనిపై రాజారావు త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నించ‌గా చంపుతామ‌ని బెదిరించారు. దీంతో గ‌త్యంత‌రం లేక గురువారం పోలీసులకు బాధిత యువ‌తి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌తిపాడు ఎస్ఐ నాగేంద్ర స్పందిస్తూ త‌మ‌కు యువ‌తి నుంచి ఫిర్యాదు వ‌చ్చింద‌ని, దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని అన్నారు. ప్రేమించి మోసం చేసిన రాజారావుని క‌ఠినంగా శిక్షించాల‌ని యువ‌తి, ఆమె త‌ల్లిదండ్రులు కోరారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner