East Godavari : మ్యాట్రిమోనీ సైట్లతో మహిళలకు వల.. రెండో వివాహం కోసం ఎదురు చూసేవారే లక్ష్యం!
East Godavari : రెండో వివాహం కోసం ఎదురుచూసేవారే అతని టార్గెట్. మ్యాట్రిమోనీ సైట్లతో వల వేసేవాడు. ఆపై ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త, ఐటీ ఉద్యోగిని అంటూ పరిచయం చేసుకునేవాడు. ఒక్కో మహిళకు ఒక్కో రకంగా చెప్పి మోసాలు చేశాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో డబ్బు కాజేసిన కేటుగాడు అరెస్టు అయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి (33) బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. 2014లో హైదరాబాద్ వెళ్లాడు. 2015లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడ్డాడు. 2016లో జాబ్ కన్సల్టెన్సీలో చేరి యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు. ఈ కేసులో వంశీకృష్ణ అరెస్టు కూడా అయ్యాడు. జైలు నుంచి విడుదలైన వంశీకృష్ణ సోషల్ మీడియాల్లో మహిళల పేర్లతో ఫేక్ అకౌంట్స్ సృష్టించి తన ఆదాయంలో అధికశాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా దాదాపు వెయ్యి మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు.
ఉద్యోగాల పేరుతో..
ఆ తరువాత యానాంలోని ఓ ఎమ్మెల్యే ఫోటో డీపీగా పెట్టుకుని ఉద్యోగ అవకాశాల పేరుతో 50 మంది మహిళలు, యువతులను నుంచి దాదాపు రూ.2.50 కోట్ల వరకూ కాజేశాడు. వరుస ఫిర్యాదులు రావడంతో రెండేళ్ల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఒకదాని తరువాత ఒక క్రిమినల్ పనులు చేసేవాడు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన వంశీకృష్ణ.. కొత్త కొత్త ఆలోచనలతో డబ్బులను కాజేసేవాడు. ఆయన బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఇప్పటికే 24 కేసులు ఉన్నాయి. తాజాగా మరో క్రిమినల్ చర్యకు పూనుకున్నాడు.
మహిళలను నమ్మించి..
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఒక రాజకీయ నేత ఫోటోతో వివరాలు పొందుపరిచాడు. తాను ఎన్ఆర్ఐని, వ్యాపారవేత్తను, ఐటీ ఎంప్లాయిని అంటూ ఒక్కొక్కొరికి ఒక్కో రకంగా పరిచయం చేసుకునేవాడు. వంశీకృష్ణ టార్గెట్ అంతా మూడు పదులు వయస్సు దాటిన మహిళలు, రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్నమహిళలే. ఆ మహిళలనే లక్ష్యంగా చేసుకుని వల విసిరేవాడు. వాట్సాప్ కాల్ ద్వారా ఆయా మహిళలతో పరిచయం చేసుకుని, సంభాషణలు చేసేవాడు. వాళ్లను నమ్మించే విధంగా మాట్లాడేవాడు. మహిళలు కూడా వంశీకృష్ణ మాటలను నమ్మేసేవారు.
డబ్బులు తీసుకొని..
తన అమ్మ అమెరికాలో డాక్టరని, తాను మాత్రం ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నానని చెప్పేవాడు. అమ్మ అమెరికా నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని నమ్మించేవాడు. అలా ఆ మహిళలు వంశీకృష్ణను నమ్మేవరకు తీవ్రంగా ప్రయత్నించేవాడు. నమ్మకం కుదిరిన తరువాత తన అసలు లక్ష్యం వైపు అడుగులు వేసేవాడు. తన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారని, ఐటీ అధికారులు డబ్బు మొత్తం తీసుకెళ్లారని, తన కుటుంబ సభ్యులు హాస్పటల్‌ల్లో ఉన్నారని, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒక్కొక్కరికి ఒక్కో కథ చెప్పి వారిని డబ్బులు అడిగేవాడు. తన పరిస్థితి కుదుట పడిన తరువాత మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేవాడు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ కాజేశాడు.
ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని..
బాధితులు తమ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా మోసపోయిన మహిళలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. మహిళల వద్ద కాజేసిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో పెట్టేవాడు. ఇలా మనోడి నేరాల చిట్టా ఇంతా అంతా కాదు. ఇటీవలి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక వైద్యురాలి వద్ద రూ.10.94 లక్షలు కాజేశాడు. ఆమె ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేటుగాడు వంశీకృష్ణ గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 13న (గురువారం) బెంగళూరులో నిందితుడు వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)