Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది చెట్లు-major fire erupts in rajahmundry reserve forest destroying hundreds of trees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది చెట్లు

Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది చెట్లు

HT Telugu Desk HT Telugu
Feb 05, 2025 05:59 PM IST

Rajahmundry Forest Fire : రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో వందలాది చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 12.5 ఎక‌రాల మేర అటవీ ప్రాంతం దగ్ధం అయ్యింది.

రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది చెట్లు
రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన వందలాది చెట్లు

Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫారెస్టులో వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బ‌త్తుల బ‌లరామ‌కృష్ణ ఫారెస్టు ప్రాంతానికి చేరుకుని, అటవీ శాఖ అధికారుల‌తో చ‌ర్చించారు. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.

yearly horoscope entry point

దివాన్ చెరువు ఫారెస్టులో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రికి స‌మీపంలో దివాన్ చెరువు రిజ‌ర్వు ఫారెస్టులో మంగ‌ళ‌వారం సాయంత్రం అగ్ని ప్రమాదం జ‌రిగింది. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని గైట్ ఇంజినీరింగ్ కాలేజీల‌కు ఎదురుగా ఉన్న ఉన్న బ్రిడ్జి కౌంటీకి వెనుక భాగంలో జ‌రిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలోని ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి. మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఆకాశంలో ద‌ట్టమైన పొగ‌లు క‌మ్మేయ‌డంతో రాజ‌మ‌హేంద్రవ‌రం న‌గ‌ర‌, ప‌రిస‌ర ప్రాంతాల ప్రజ‌లు ఆందోళ‌న చెందారు. విష‌యం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అట‌వీ శాఖ‌, అగ్నిమాప‌క ద‌ళాల‌ను అప్రమ‌త్తం చేశారు.

రాజ‌మహేంద్రవ‌రం, కోరుకొండ కేంద్రాల నుంచి ఘట‌నా స్థలానికి అగ్నిమాప‌క వాహ‌నాలు చేరుకున్నాయి. అయితే వాహనాలు ఫారెస్టు లోప‌లికి వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోయింది. దీంతో బ్లోయ‌ర్ల సాయంతో మంట‌ల‌ను అదుపు చేసే ప్రయ‌త్నం చేశారు. మంట‌లు విస్తరించ‌కుండా నిరోధించేందుకు ప్రయ‌త్నించారు. అయితే అప్పటికే దాదాపు 12.5 ఎక‌రాల మేర మంట‌లు విస్తరించి, ద‌గ్ధం అయింది. దీంతో వంద‌లాది చెట్లు కాలి బూడిద‌య్యాయి.

రిజర్వ్ ఫారెస్ట్ లో అసాంఘిక కార్యకలాపాలు

రిజ‌ర్వ్ ఫారెస్టులో అసాంఘిక కార్యక‌లాపాల‌కు నిల‌యంలగా ఉండే ఈ ప్రాంతంలో ఆక‌తాయిలు కాల్చిపారేసిన సిగ‌రెట్ కార‌ణంగానే ఈ ప్రమాదం సంభ‌వించి ఉండొచ్చని భావిస్తున్నారు. చెట్లు ఆకు రాల్చే కాలం కావడంతో ఎండిపోయిన ఆకులు ద‌ట్టంగా ఉన్నాయి. దీనివ‌ల్ల మంట‌లు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ న‌ష్టం వాటిల్లలేద‌ని అట‌వీ శాఖ సిబ్బంది తెలిపారు.

రాజానగరం సమీపంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం పై దాకా చొచ్చుకు వెళ్లకుండా కొంతవరకు అరికట్టగలిగామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజానగరం సమీపంలోని దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ హుటా హుటిన అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణతో కలిసి ప్రమాదస్థలికి వెళ్లారు. అక్కడ అట‌వీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి ప‌ద్మావ‌తితో మాట్లాడి ప్రమాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు.

ప్రమాదం పెద్దదికాకముందే

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అభయారణ్యంలో ఆకులు రాలిన చాలాకాలం తర్వాత అవి లిట్టర్ గా మారాక మానవ ప్రమేయంతో ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. ప్రమాదం పెద్దది కాకముందే అగ్నిమాపక సిబ్బంది త్వరతగతిన వచ్చి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. త్వరితగతిన స్పందించడం వల్ల చాలా సంఖ్యలో వృక్షాలు కాలి బూడిదకాకుండా కాపాడగాలిగామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, అగ్ని మాపక సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు.

అటవీ సంపాదన కాపాడే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ తరహా అంశంపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా కమిటీగా ఏర్పడి ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేలా చైతన్యం కల్పిస్తామన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం