Srisailam Brahmotsavalu 2025 : రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ముఖ్యమైన 10 విషయాలు
Srisailam Maha Shivratri Brahmotsavam 2025: రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మార్చి 1వ తేదీతో పూర్తి కానున్నాయి. గతేడాది పోల్చితే ఈసారి అదనపు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫైల్ ఫొటో)
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. రేపటి నుంచే ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మార్చి ఒకటో తేదీతో ముగుస్తాయని… 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మహాశివరాత్రి వేళ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అందులోనూ శ్రీశైలం ప్రత్యేకమని చెప్పొచ్చు. సాధారణ భక్తులతో పాటు శివ మాల ధరించిన భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు - ముఖ్యమైన అంశాలు:
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై… మార్చి 1వ తేదీతో ముగియనున్నాయి.
- మొత్తం 11 రోజులు సాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
- బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో పలు వాహన సేవలు కూడా నిర్వహిస్తారు. ధ్వజారోహణ, భృంగి వాహనసేవ, హంస వాహనసేవ, మయూర వాహనసేవ, రావణ వాహనసేవ, పుష్పపల్లకీ సేవ, గజ వాహనసేవ, మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం వంటి ఉంటాయి.
- రథోత్సవం, తెప్పోత్సవం, యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కూడా నిర్వహిస్తారు.
- శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయును ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఇందులో భాగంగా 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించనున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందు అంటే ఫిబ్రవరి 22వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందుతాయి.
- కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు దేవస్థానం అధికారులు చేపట్టారు.
- ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరునాడు జరిగే రథోత్సవం కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు. క్యూలైన్ల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోనున్నారు.
- బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.
- భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు బస్సు సర్వీసులను నడపనుంది. గతేడాది 382 బస్సులు నడపగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బస్సుల సంఖ్యను పెంచారు. ఈ ఏడాది 453 బస్సులను నడిపేలా ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
సంబంధిత కథనం