Vontimitta Temple : మార్చి 6 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం - ఏ రోజు ఏం చేస్తారంటే..?-maha samprokshan and kumbhabhishekam will be held from 6th to 9th march at vontimitta temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vontimitta Temple : మార్చి 6 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం - ఏ రోజు ఏం చేస్తారంటే..?

Vontimitta Temple : మార్చి 6 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం - ఏ రోజు ఏం చేస్తారంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 15, 2025 07:02 AM IST

Vontimitta Sri Kodandarama Swamy Temple : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను ప్రకటించింది. మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా పూజలకు అంకురార్పణ చేయనున్నారు.

ఒంటిమిట్ట ఆలయం (ఫైల్ ఫొటో)
ఒంటిమిట్ట ఆలయం (ఫైల్ ఫొటో)

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మహా సంప్రోక్ష‌ణ, కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆలయంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల‌కు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది.

ఏ రోజు ఏం చేస్తారంటే…?

  • మార్చి 6వ తేదీ ఉదయం 7.30 గంట‌ల‌కు భ‌గ‌వ‌త్పుణ్యాహ‌ము, అగ్ని మ‌ధ‌న‌ము ఉంటుంది. యాగశాలలో వైధిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివారకుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హ‌వన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి అర్చన నిర్వహిస్తారు.
  • సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, స‌హ‌స్ర‌ కలశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి శాత్తుమొర జరగనుంది.
  • మార్చి 7వ తేదీన ఉద‌యం 8 గంట‌ల‌కు సహస్ర కలశావాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపురం ఛాయా స్న‌పనము, పరివార హోమ‌ములు, పూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతు:స్థానార్చ‌న‌ము, మూర్తి హోమం జరుగుతుంది.
  • మార్చి 8వ తేదీన ఉద‌యం 6 గంట‌ల‌కు చతు:స్థానార్చ‌న‌ము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, స‌హ‌స్ర‌క‌ల‌శాది దేవత హోమం, స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, పూర్ణాహుతి ఉంటుంది.
  • సాయంత్రం 6 గంటలకు కళాపకర్షణ, శ‌య్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వ‌న్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం నిర్వహించనున్నారు.
  • మార్చి 9వ తేదీన ఆదివారం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచసూక్త – ప‌వమాన హోమములు నిర్వ‌హిస్తారు.
  • అనంత‌రం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10 15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్ష‌ణ మ‌రియు మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో గ‌త ఏడాది సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం నిర్వ‌హించిన విష‌యం సంగతి తెలిసిందే. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేశారు.

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు - కీలక నిర్ణయాలు:

కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు. ఈవో ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం శుక్రవారం అధికారులతో సమీక్షించారు.

శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 – 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జేఈవో సూచించారు. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర పండుగ లాంటిదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వామివారి ముత్యాల తలంబ్రాలు తయారీ, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకు వసతి, ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

భక్తులకు ఎండ వేడిమి, అనుకోకుండా వర్షం వస్తే ఉపశమనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని జేఈవో వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఎండ వేడిమికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేందుకు అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం