AP Crime News : భర్తకు ప్రేమగా బిర్యానీ పెట్టిన భార్య, ఆపై ప్రియుడితో కలిసి మర్డర్-సినిమా స్టోరీని మించిన క్రైమ్
AP Crime News : భార్య ప్రేమగా పెట్టిన బిర్యానీ తిన్న భర్త... ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే... తన తండ్రిని హత్య చేయడానికి కొడుకు కూడా సాయపడ్డారు. ఆస్తి విషయంలో గొడవలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు గుర్తించారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గతేడాది జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. బిర్యానీలో మత్తుమందు కలిపి భర్యకు పెట్టిన భార్య... ప్రియుడు, కుమారుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని మూటగట్టి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింద పడేసింది. గతేడాది జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింద గుర్తుతెలియన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ మీడియాకు తెలిపారు.
అసలేం జరిగింది?
మడకశిర పోలీస్ స్టేషన్ పరిధిలో నివశిస్తున్న మోహన్ కుమార్(52) భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో మోహన్ కుమార్ భార్య కవిత కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి వేరుగా ఉంటోంది. కవితకు కర్ణాటక తుమకూరు జిల్లా గుబ్బిలో విద్యుత్‌శాఖ జేఈగా పనిచేస్తున్న అక్తర్‌పాషాతో వివాహేతర సంబంధం ఏర్పడిది. కవిత...అక్తర్ పాషాతో ఇచ్చిన డబ్బులతో తుమకూరులో ఓ హోటల్ పెట్టింది. మోహన్ కుమార్ పలుమార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య, ఆమె ప్రియుడు అక్తర్ పాషా, హోటల్‌లో పనిచేసే వంట మనిషి, కుమారుడిని తరచూ దూషించేవాడు. తన ఆస్తిని తనకు ఇవ్వాలని భార్య, కుమారుడితో గొడవపడే వాడు. దీంతో భర్త అడ్డుతొలగించుకోవాలని భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, కుమారుడితో కలిసి ప్లాన్ వేసింది. వంట మనిషి మోహన్ ప్రసాద్‌కు రూ. లక్ష సుపారీ మాట్లాడి...భర్త మర్డర్ కు ప్లాన్ చేశారు.
ప్లాన్ ప్రకారం కుమార్తెకు ఆరోగ్యం బాగా లేదని భర్త మోహన్ కుమార్‌ను 2023 జనవరి 11న ఇంటికి పిలిచింది భార్య కవిత. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టింది. బిర్యానీ తిని అతడు నిద్ర మత్తులోకి జారుకోగానే... భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి... మోహన్ కుమార్ తలపై రోకలిబండతో బలంగా కొట్టారు. కవిత ప్రియుడు అక్తర్‌పాషా... మోహన్ కుమార్ గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కట్టి మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది పడేశారు.
గుర్తుతెలియని మృతదేహం కేసు నుంచి
బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా మిస్సింగ్ కేసుల జాబితా తీశారు. మడకశిర చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లలో మిస్సింగ్ కేసులపై ఆరా తీయగా... కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పీఎస్ లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన ఓ మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) కనిపించడంలేదని 2023 జనవరి 21న ఫిర్యాదు చేసింది. ఈ కేసు వివరాలు సేకరించిన మడకశిర పోలీసులు... మృతదేహం ఫొటోను ఆ మహిళకు చూపించారు. ఆ ఫోటో తన పెద్ద కుమారుడునని మహిళ గుర్తుపట్టింది. పోలీసుల విచారణలో మృతుడికి, అతని భార్య కవితకు గొడవలు ఉన్నాయని తెలిసింది. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా... హత్య విషయం చెప్పేసింది.
ఈ కేసులో నిందితులైన కవిత, ఆమె ప్రియుడు అక్తర్ పాషా, కౌశిక్, మోహన్ ప్రసాద్ ను తుమకూరులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
సంబంధిత కథనం