Machilipatnam Port : రేపు మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటన, బందర్ పోర్టు పనులకు శ్రీకారం
Machilipatnam Port : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ రేపు(సోమవారం) శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
Machilipatnam Port : సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం(మే 22) కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి బందరు మండలం తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు సీఎం. అక్కడ పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసి, పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఆ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
దశాబ్దాల కల
మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం జరిగితే స్థానికుల దశాబ్దాల కల నెరవేరుతుందని స్థానిక ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులతో పూర్తిగా ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులకు శంఖుస్థాపనతో పాటు, నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ బాలశౌరి అన్నారు. సీఎం జగన్ పర్యటన, పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై పేర్ని నాని ఆరా తీశారు. ఇటీవల పోర్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించిన నాని... మీడియాతో మాట్లాడుతూ రూ.5500 కోట్లతో 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఎకరం కూడా స్థానికుల నుంచి తీసుకోలేదన్నారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తామని పేర్ని నాని అన్నారు. పోర్ట్ నిర్మాణం ద్వారా మచిలీపట్నం రూపురేఖలు మరతాయన్నారు. భూసేకరణ, రైలు, రోడ్డు నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు.
75 శాతం బ్యాంకు రుణం
బందరు పోర్ట్ నిర్మాణానికి రూ.5,253.88 కోట్లు అవసరం ప్రభుత్వం అంచనా వేసింది. పోర్ట్ నిర్మాణానికి 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో రుణం తీసుకునే అంశంపై చర్చించారు. రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి ఇవ్వడంతో... పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ రేపు శ్రీకారం చుట్టనున్నారు. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2 కిలోమీటర్ల 325 మీటర్ల మేర బ్రేక్స్ వాటర్ గోడలు నిర్మించాలని నిర్ణించారు. ఈ గోడల నిర్మాణానికి రూ.446 కోట్లు అవసరం అంచనా వేశారు. ఉత్తరం వైపున 250 మీటర్ల దూరం కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, దక్షిణం వైపు బ్రేక్ వాటర్ రూ. 435 కోట్ల వ్యయంతో గోడ నిర్మించనున్నారు. పోర్టు ప్రాంతంలో డ్రెడ్జింగ్ కోసం రూ.1242.88 కోట్లు, ఓడలు వచ్చే అప్రోచ్ ఛానెల్ కోసం రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ సిద్ధం చేశారు.