Pinnelli Ramakrishna Reddy Arrest : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్, బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
Pinnelli Ramakrishna Reddy Arrest : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన 4 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు.
Pinnelli Ramakrishna Reddy Arrest : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్ న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈవీఎం ధ్వంసం సహా పలు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు.
నాలుగు కేసులు
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నరసరావుపేటలో పిన్నెల్లిని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం మాచర్లలోని కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఏపీ ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయొద్దని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు పిన్నెల్లి. ఈ పిటిషన్లను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది.
పోలింగ్ రోజు విధ్వంసం
మే 13 పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. పిన్నెల్లిని ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను బెదిరించారు. పోలింగ్ తర్వాత రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి కారంపూడిలో దాడులకు తెగబడ్డారని అభియోగాలున్నాయి. సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటనలపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అప్పట్లో తాత్కాలికంగా బెయిల్ పొందారు పిన్నెల్లి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. జూన్ 20న ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తాజాగా హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు. పిన్నెల్లి సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.