Pinnelli anticipatory bail: మూడు కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు
Pinnelli anticipatory bail: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవిఎం ధ్వంసం కేసులో బెయిల్ మంజూరైన తర్వాత నమోదైన కేసుల్లో సైతం ముందస్తు బెయిల్ మంజూరైంది.
Pinnelli anticipatory bail: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఎన్నికల పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు ఈవిఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పాటు ఇతర కేసుల్లో సైతం బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది.
మాచర్లలో జరిగిన ఘర్షణల్లో బాధితులపై దాడికి పాల్పడటంతో పాటు నేరుగా బాధితుల్ని బెదిరించారనే అభియోగాలపై పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. మే 13, 14 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో పలు అభియోగాల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. వీటిలో ఈవిఎం ధ్వంసం కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు హత్యాయత్నం కేసుతో పాటు ఇతర కేసుల్లో సైతం బెయిల్ కోసం సోమవారం పిన్నెల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలింగ్ రోజు పిన్నెల్లిని ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడినందుకు మరో కేసు నమోదు చేశారుర. కారంపూడిలో సీఐపై దాడి ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ మూడు కేసుల్లో హైకోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేశారు.
మంగళవారం ఉదయం మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈవిఎం ధ్వంసం కేసులో విధించిన షరతులే ఈ కేసుల్లో కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. జూన్6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.
మే13వ తేదీన మాచర్ల నియోజక వర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్‌బూత్‌లో ఈవిఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి గతవారం పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో పరారయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ జరిగే వరకు పోలీసులు చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు పిన్నెల్లిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం సహా, పోలీసులపై దాడి కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించారు.
23వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయగా, 22వ తేదీన కేసులు నమోదు చేసినట్టు నమోదు చేశారని పిన్నెల్లి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది.