Tirumala Alert: తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు.. వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి
Tirumala Alert: తిరుమల ఘాట్ రోడ్లలో దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటంతో భక్తులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. రెండో ఘాట్ రోడ్డులో దృశ్య గోచరత తక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తుల్ని హెచ్చరించింది.
Tirumala Alert: తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు ఉండటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో సోమవారం 47వ కౌంటర్ లో యూపిఎస్ వైర్ కాలడంతో వ్యాపించిన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమై పొగను సిబ్బంది అదుపు చేశారు.
జనవరి 15వ తేదీన ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.