AP TG Weather Updates: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాల రాక-low pressure in bay of bengal tomorrow rains in telugu states arrival of monsoon in first week of june ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather Updates: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాల రాక

AP TG Weather Updates: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాల రాక

Sarath chandra.B HT Telugu
May 21, 2024 06:57 AM IST

AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా ఆశజనకంగా ఉందని ఐఎండి అంచనా వేస్తోంది.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో మండే ఎండల నుంచి ఉపశమనం
బంగాళాఖాతంలో అల్పపీడనంతో మండే ఎండల నుంచి ఉపశమనం (photo source https://unsplash.com/)

AP TG Weather Updates: బంగాళా‌ఖాతంలో ద్రోణి ప్రభావంతో బుధవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం శ్రీకాకుళం 8, విజయనగరం 6, మన్యం 12, అల్లూరి జిల్లా 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ శాఖ SDMA అధికారులు సూచించారు.

సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో 42.5మిమీ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 38.2మిమీ, కోనసీమ మండపేట, విజయనగరం కొత్తవలసలో 30.5మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగలలో 27.2మిమీ,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 26మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం…

నైరుతి బంగాళాఖాతంలో బుధవారానికి అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి మే 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడతుంది. నెలాఖరుకల్లా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫాను గమనం, ప్రభావాన్ని ముందే నిర్ధారించడం కష్టమని ప్రకటించారు. వాయుగుండం తుఫానుగా మారే విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన ఐఎండి చేయలేదు.

ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ కూడా బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అల్పపీడనం మధ్య బంగాళా ఖాతం నుంచి ఈనెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం వైపు పయనిస్తుందని కొన్ని సంస్థలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని మరికొన్ని అంచనాలు పేర్కొన్నాయి.

ఏపీ తీరం వైపుకు తుఫాను వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఏపీలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం పయనంపై బుధవారానికి మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే క్రమంలో రాష్ట్రంలో ఎండలు పెరుగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రుతుపవనాల రాకకు దోహదం….

అండమాన్‌, బంగాళాఖాతంలలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి అల్పపీడనం సాయపడుతుందని ఐఎండీ డైరెక్టర్‌ డాక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించాయని ఈ నెల 31వ తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని, జూన్‌ రెండో వారానికి ఒడిశాలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. మే నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ హైదరాబాద్‌ వెల్లడించింది. మే20 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నగరంలో కూడా తేలికపాటి జల్లులు పడనున్నాయి.

సోమవారం హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, మోతీనగర్‌, మూసాపేట, హైదరాబాద్‌ యూనివర్సిటీ, బాలాజీనగర్‌, జీడిమెట్ల, కూకట్‌పల్లి, బండ్లగూడ, హయత్‌నగర్‌, మియాపూర్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వికారా బాద్‌ జిల్లాలోని రుద్రారం, తాండూరులలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. యాలాల మండల పరిధిలోని హజీపూర్‌ శివారులో పిడుగు పడి ఐదు మేకలు మృతి చెందాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం