కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటంతో పాటు చంద్రబాబును, లోకేష్‌ను వ్యక్తిగతంగా దూషించడంతో టీడీపీకి టార్గెట్‌గా మారారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్ళి పోకుండా నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించే నాయకుల్లో ఒకరైన కొడాలి నాని ఓటమి తర్వాత హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొడాలి నాని కొద్ది సార్లు మాత్రమే గుడివాడకు వచ్చారు.
ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నాని అనుచరులపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నాని అనుచరుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మట్టి తవ్వకాలు, అక్రమ చేపల చెరువుల తవ్వకాలు, భూ కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కొడాలి నానికి ఏపీలో పాస్‌పోర్టు లేదు. రైతు మోషే కేసులో జైలుశిక్ష ఖరారు కావడంతో పాటు పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్‌పోర్టు జారీ చేయలేదు.
హైదరాబాద్ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురి కావడంతో ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో నాని విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొడాలి నాని వైద్య చికిత్స పేరుతో అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు సందేహిస్తున్నాయి. వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.
గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో రూ.కోట్ల రుపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతల్ని దూషించడం, చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. కొడాలి నానిపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
కొడాలి నానికి లుకౌట్ నోటీసుల ప్రచారాన్ని వైసీపీ వర్గాలు తప్పు పడుతున్నాయి. కొడాలి నానిపై లుకౌట్ జారీ చేయాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే లుకౌట్ జారీ చేసినట్టు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.