Fee Reimbursement: క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలకు లోకేష్‌ హామీ-lokesh promises to release fees for engineering colleges as per calendar ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fee Reimbursement: క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలకు లోకేష్‌ హామీ

Fee Reimbursement: క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలకు లోకేష్‌ హామీ

Bolleddu Sarath Chandra HT Telugu
Feb 04, 2025 06:33 AM IST

Fee Reimbursement: ఫీజురియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలన్న ఇంజనీరింగ్ కాలేజీల విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్‌ సానుకూలంగా స్పందించారు. ఇకపై క్యాలెండర్ ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

నారా లోకేష్‌తో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు
నారా లోకేష్‌తో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు

Fee Reimbursement:  ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలండర్ ప్రకారం విడుదల చేయాలని ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు. ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజులు గిట్టుబాటుగా లేవని, వాటిని సవరించాలని కోరారు. ఈ విషయంలో ముందస్తుగా కసరత్తు ప్రారంభించాలన్నారు. ఎంసెట్ షెడ్యూలును నిర్ణీత సమయం ప్రకారం విడుదల చేయాలని, ఎంసెట్ లో 3 కౌన్సిలింగ్స్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. 

yearly horoscope entry point

ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివిన విద్యార్థుల ప్లేస్ మెంట్స్ విషయంలో ప్రభుత్వం చొరవచూపాలని, ఇందుకోసం స్టేట్ లెవల్ జాబ్ మేళా తో సహా యూనివర్సిటీల్లో ఆయా కంపెనీలను రప్పించి జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు. అటెండెన్స్ విషయంలో వెయిటేజి విధానాన్ని అమలుచేస్తే సత్ఫలితాలు ఉంటాయని సూచించారు. తద్వారా విద్యార్థుల్లో మోటివేషన్ వచ్చి హాజరుశాతం పెరిగే అవకాశం ఉందని వివరించారు. 

రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసర్చ్ (ఎన్ఐటిటిపిఆర్) ను పునరుద్దరించాలని, వీలైతే 3చోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటుచేసి అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేషనల్ క్రెడిట్ అండ్ క్వాలిటీ ఫ్రేమ్ వర్క్ (ఎన్ సిక్యుఎఫ్) కు లోబడి మైక్రో సర్టిఫికేషన్ ను అమలుచేయాలని సూచించారు.

కాలేజీల వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్‌ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచించారు.  గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమికస్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో గత 10 సంవత్సరాలుగా సంస్కరణలు లేవు, తాను హెచ్ ఆర్ డి మంత్రి అయ్యాక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. 

విద్యావ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నది తమ ఉద్దేశంగా పేర్కొన్నారు. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఈ ఏడాది ఆర్ టిఎఫ్ స్కాలర్ షిప్ లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను, ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేశామని, రెండు, మూడు రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, ఆర్ అండ్ డి, ఇన్నొవేషన్స్ పై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. 

విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం అని లోకేష్ అన్నారు.

Whats_app_banner