Naralokesh In Delhi: నాలుగు రోజులుగా ఢిల్లీలోనే లోకేష్, తప్పని ఎదురు చూపులు
Naralokesh In Delhi: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టై, రిమాండ్‌కు వెళ్లిన తర్వాత లోకేష్ గత వారం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న లోకేష్ కీలక నాయకులతో సమావేశం కోసం ప్రయత్నిస్తున్నారు.
Naralokesh In Delhi: టీడీపీ నాయకుడు నారా లోకేష్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అరెస్టై రిమాండ్‌కు వెళ్లిన తర్వాత గత గురువారం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అంతకు ముందు రెండు సార్లు జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. 14వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి లోకేష్ తండ్రిని కలిశారు. ఆ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
లోకేష్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత శుక్రవారం ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు ప్రయత్నించారు. దాంతో పాటు జాతీయ మీడియా సంస్థల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఏమి జరిగిందో వివరించే ప్రయత్నాలు చేశారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు అందుబాటులో లేరు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో వారంతా హైదరాబాద్‌లో ఉన్నారు. శనివారం సాయంత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా ఆదివారం తిరిగి ఢిల్లీ వెళ్లారు. తాను రాజకీయ నాయకుల్ని కలిసేందుకు ఢిల్లీ రాలేదని లోకేష్ చెప్పినా ఆయన తరపున ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి.
సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఏపీలో సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలున్నారు. రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు. దీంతో మాజీ ఎంపీలను కూడా ఢిల్లీ పిలిపించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణాామాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే సీన్ రిపీట్ అవుతోంది….
2009లో వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎదురైన రాజకీయ పరిస్థితులకు సరిపోయేలా ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటోంది. 2010మార్చి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొవడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి పాదయాత్రకు సిద్ధమైన తర్వాత, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి.
కాంగ్రెస్‌తో జగన్ పేచీ నడుస్తుండగానే ఎమ్మెల్యే శంకర్ రావు ఫిర్యాదు చేయడంతో అతనిపై విచారణ మొదలైంది. అందులో టీడీపీ తరపున ఎర్రన్నాయుడు ఇంప్లిడ్ అయ్యారు. ఇక జగన్ చుట్టు కేసుల ఉచ్చు బిగిస్తున్న సమయంలో చాలా మంది ఆయనకు మద్దతుగా మాట్లాడే వాళ్ళు, కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ అగ్ర నేతలు ఆరోపించే వారు. జగన్ తరపున పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ ను కూడా ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరిగేవి.
అద్వానీ, ప్రకాష్ జవదేకర్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, సీతారామ్ ఏచూరి, సీపీఐ రాజా, డిఎంకె శివ వంటి వారు జగన్ తరపున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రి కొడుకును కాంగ్రెస్ వేధిస్తోంది అని బీజేపీ ముఖ్య నాయకులు విమర్శించే వారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కష్టాలకు పరోక్షంగా చంద్రబాబు అండదండలు అందించారని వైసీపీ విశ్వసిస్తుంది.
అప్పట్లో రాజకీయ కక్షల మీద ఎవరెన్ని విమర్శలు చేసినా 16నెలల పాటు జైలు తప్పలేదు. దాదాపు 13ఏళ్ల తర్వాత ఏపీలో ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంచుమించు అదే తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదయ్యే నాటికి ఆయన వెంట చాలా తక్కువ మంది నాయకులు ఉన్నారు. ఓ దశలో ఆయన తరఫున ఢిల్లీలో మాట్లాడే నాయకులు కూడా లేకుండా పోయారు ఇప్పుడు చంద్రబాబు అరెస్టై జైలుకెళ్లిన సమయంలో టీడీపీ అధ్యక్షుడు కూడా అదే రకమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
ఇండియా కూటమితో పాటు ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదు. ఒకప్పటి ఎన్డీఏ కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పన బాబు పలు మార్లు ఆ కూటమి నుంచి వైదొలగడంతో దాని మద్దతు పొందలేకపోయారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి ఆశించిన స్పందన కొరవడింది. ఈ నేపథ్యంలో లోకేష్ హస్తిన పర్యటన ఏ మేరకు సఫలం అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.