Avinash reddy Arrest: ఎంపీ అవినాష్ అరెస్ట్, విడుదలపై లోక్‌సభ బులెటిన్ విడుదల..
Avinash reddy Arrest: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసినట్లు సిబిఐ లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు లోక్‌సభ మంగళవారం బులెటిన్ విడుదల చేసింది.
Avinash reddy Arrest: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి, విడుదల చేసినట్లు సిబిఐ లోక్‌సభ సచివాలయానికి సమాచారం అందించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్. అవినాష్‌రెడ్డిని నిబంధనల మేరకు లాంఛనంగా అరెస్టు చేసి వెంటనే రూ.5లక్షల పూచీకత్తుపై విడుదల చేసినట్లు లోక్‌సభ సచివాలయానికి సీబీఐ సమాచారం అందించింది.
జూన్ 30వ తేదీన సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ డీఐజీ పంపిన లేఖలో ఈ నెల 3వ తేదీన తమకు అందినట్లు లోక్‌సభ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ''కడప లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అవినాష్‌రెడ్డిని సిబిఐ నమోదు చేసిన ఆర్‌సీ నం.4 (ఎస్)/2020/సీబీఐ/స్పెషల్ క్రైమ్-3/న్యూఢిల్లీ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-1973లోని సెక్షన్ 36, 41 కింద అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో లాంఛనంగా అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు క్రిమినల్ పిటిషన్ నం.3798/2023లో మే 31వ తేదీన తెలంగాణ హైకోర్టు, ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది.
వివేకా హత్య కేసులో అరెస్ట్ చేయాల్సి వస్తే రూ.5లక్షల వ్యక్తిగత పూచీకత్తు, రెండు ష్యూరిటీలపై బెయిల్ మీద విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీన అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే హైకోర్టు తీర్పునకు లోబడి అదేరోజు బెయిల్‌పై విడుదల చేసినట్లు లోక్‌సభకు సీబీఐ సమాచారం ఇచ్చినట్లు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌లో వెల్లడించింది.