AP Wine Shops : గీత కార్మికులకు మద్యం దుకాణాలు.. లాటరీ ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!-liquor store lottery process postponed due to mlc elections in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wine Shops : గీత కార్మికులకు మద్యం దుకాణాలు.. లాటరీ ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

AP Wine Shops : గీత కార్మికులకు మద్యం దుకాణాలు.. లాటరీ ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 10, 2025 10:34 AM IST

AP Wine Shops : కూటమి ప్రభుత్వం కల్లు గీత వృత్తిదారులకు 10 శాతం మద్యం దుకాణాలను కేటాయించింది. లాటరీ ద్వారా వీరికి దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. అయితే.. ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా.. 15 జిల్లాల్లో దుకాణాల కేటాయింపు వాయిదా పడింది.

మద్యం దుకాణం
మద్యం దుకాణం

రాష్ట్రంలో కల్లుగీత కార్మిక కులాలకు కేటాయించిన మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం.. ఇవాళ లాటరీ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా 15 జిల్లాల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. కోడ్‌ అమల్లో లేని 10 జిల్లాల్లో గతంలో ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారమే లాటరీ ద్వారా లైసెన్సుదారుల్ని ఎంపిక చేయనున్నారు.

ఈ జిల్లాల్లో వాయిదా..

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో లాటరీ ప్రక్రియను వాయిదా వేశారు.

స్పందన అంతంతే..

ఈ 15 జిల్లాల పరిధిలో 202 దుకాణాలకు లాటరీ తీయాల్సి ఉంది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోని 137 దుకాణాలకు ఇవాళ లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. అయితే.. వీటికోసం పెద్దగా పోటీ లేదు. స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

నష్టాలు వస్తున్నాయని..

మద్యం దుకాణంతో గిట్టుబాటు కాదని గీత వృత్తిదారులు ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ఒక్కో దుకాణానికి సగటున 7 దరఖాస్తులు కూడా అందలేదు. దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో షాపులు దక్కించుకున్న లైసెన్స్‌ దారులు నష్టాలు వస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఆ ప్రభావం గీత కార్మికుల షాపులపై పడిందని అధికారులు భావిస్తున్నారు.

20 శాతం కమీషన్ ఇస్తామని..

మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌కు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రకటించింది. డిస్టిలరీల నుంచి సరఫరా అయిన బాటిళ్లపైనే 20 శాతం ఇస్తున్నారు. డిపోల నుంచి ఇచ్చే ధరకు ఇస్తే లాభసాటిగా ఉండేది. డిస్టిలరీల నుంచి డిపోలకు తక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుంది. దానిపై 20 శాతం ఇస్తున్న కారణంగా.. లైసెన్స్‌దారులకు నష్టం వస్తోంది.

నామినేషన్లకు లాస్ట్ డే..

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటితో ముగియనుంది. ఇవాళ (సోమవారం) భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 27న పోలింగ్‌ ఉంటుంది. వచ్చేనెల మార్చి 3న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

Whats_app_banner