AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!-liquor sales are huge at cock fight competition events ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

HT Telugu Desk HT Telugu
Jan 15, 2025 09:16 PM IST

రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేళ‌ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. వాట‌ర్ బాటిల్స్‌, కూల్ డ్రింక్స్ త‌రహాలో లిక్కర్ అమ్మేస్తున్నారు . ఓ రకంగా చెప్పాలంటే కోడి పందేల బ‌రుల వద్ద మ‌ద్యం ఏరులైపారుతున్న పరిస్థితులు కనిపించాయి. యి.

కోడిపందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం
కోడిపందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం

రాష్ట్రంలో సంక్రాంతి సంబ‌రాలు అంబ‌రాన్ని అంటుతున్న వేళ కోడి పందేలు, పేకాట‌, గుండాట వంటి జూద క్రీడ‌ల్లో కోట్లు చేతులు మారుతున్నాయి. డ‌బ్బులు వ‌చ్చిన వారు ఆనందంతో ఇళ్ల‌కు వెళ్తున్నారు. డ‌బ్బులు పోయిన‌వారు దుఃఖంతో ఇంటికి వెళ్తున్నారు. భోగి రోజున ప్రారంభ‌మైన కోడి పందేలు, పేకాట‌, గుండాట రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా నిరాటంకంగా కొన‌సాగుతోన్నాయి. అక్క‌డే భోజ‌నం, మందు, నీళ్లు, ఇత‌ర తినిబండ‌రాళ్లు స్టాల్స్ పెట్టి అమ్మ‌డంతో పందె రాయుళ్లు, జూద క్రీడ‌లు ఆడేవారు అక్క‌డ నుంచి వెళ్ల‌టం లేదు.

yearly horoscope entry point

ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం లాట‌రీ ప‌ద్ధ‌తిలో మ‌ద్యం షాపుల‌ను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని విచ్చ‌ల విడిగా బెల్ట్‌షాప్‌లు పుట్టుకొచ్చాయి. ఈ సంక్రాంతి వేళ కొత్త‌గా సంత‌లో స్టాల్స్ మాదిగా మ‌ద్యం స్టాల్స్ వ‌చ్చాయి. కోడి పందేలు జ‌రుగుతున్న ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టి మ‌రి అక్ర‌మంగా మ‌ద్యం అమ్మ‌కాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం ఏరులై పారుతోంది. స్టాల్స్ పెట్టి మ‌ద్యం అమ్మేవారికి స్థానిక అధికార పార్టీ నేత‌లు అండ‌దండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పైగా కోడి పందేల బ‌రుల నిర్వ‌హ‌కులు కూడా వీరికి మ‌ద్ద‌తుగా నిల‌వడంతో ఎవ‌రు ఏమీ అన‌డం లేదు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారి జోలికి పోవ‌టం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

భారీగా మద్యం అమ్మకాలు….

కోడి పందేల బ‌రుల వ‌ద్ద భారీగా మద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని దేవిప‌ట్నం మండలంలోని ఎం.రావిలంక గ్రామ శివార్ల‌లో మామిడ తోట వ‌ద్ద జోరుగా కోడి పందేలు, నంబ‌ర్ గుండాట జ‌రుగుతోంది. అక్క‌డ కోడి పందేలు ప్రాంగ‌ణంలో విచ్చ‌ల విడిగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. వాట‌ర్ బాటిల్స్‌, కూల్ డ్రింక్స్ త‌ర‌హాలోనే మ‌ద్యం సీసాలు పెట్టి అమ్మకాలు నిర్వ‌హిస్తున్నారు. బ‌హిరంగంగా మ‌ద్యం అమ్మే వారిలో మ‌హిళ‌లు కూడా ఉన్నారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అక్ర‌మంగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి.

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో ఒక్క భోగి రోజే అధికారిక లెక్క‌ల ప్ర‌కారం రూ.28.40 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇంకా సంక్రాంతి, క‌నుమ రోజుల లెక్కలు చూస్తే… మ‌రింత పెరుగుతుంది. కాకినాడ జిల్లాలో రూ.11.25 కోట్లు, కోన‌సీమ జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పుగోదావ‌రి జిల్లాలో రూ.10.15 కోట్ల మ‌ద్యాన్ని ఆయా జిల్లాల్లోని ఉన్న దుకాణాలు కొనుగోలు చేశాయి.

గ‌తేడాది భోగి రోజు రూ.12.60 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. అంటే గ‌తేడాది కంటే ఈసారి రూ.15.80 కోట్లు అమ్మకాలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా డిస్ట‌ల‌రీల స్టోర్లు విక్ర‌యించిన లెక్క‌ల ప్రకార‌మే. అయితే అక్ర‌మంగా మ‌ద్యం ఏరులై పార‌డంతో ఈ లెక్క మారుతుంది. మ‌ద్యం ఒక్క‌టే కాదు సారా కూడా పెద్ద ఎత్తున అమ్మ‌కాలు జ‌రిగాయి…!

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం