Liquor Prices: బెజవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు.. సిండికేట్ల పోరులో బార్‌లలో తగ్గిన మద్యం ధరలు-liquor prices reduced heavily in bezwada liquor prices reduced in bars due to syndicate fight ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Prices: బెజవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు.. సిండికేట్ల పోరులో బార్‌లలో తగ్గిన మద్యం ధరలు

Liquor Prices: బెజవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు.. సిండికేట్ల పోరులో బార్‌లలో తగ్గిన మద్యం ధరలు

Bolleddu Sarath Chandra HT Telugu
Published Oct 22, 2024 08:22 AM IST

Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ఖజానాకు లాభం మాటెలా ఉన్నా మద్యం వినియోగదారులకు మాత్రం బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పాపులర్ బ్రాండ్లు అందుబాటులో వచ్చాయని సంబరపడుతుంటే మద్యం సిండికేట్ల మధ్య పోటీతో ధరలు కూడా తగ్గిస్తున్నారు.

విజయవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు
విజయవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు

Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల రాకతో మద్యం వ్యాపారంలో పోటీ అధికమైంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం, ఏ బ్రాండ్లను విక్రయించాలనేది కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లోనే ఉండేది. 2019కు ముందు వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్లు కనుమరుగై పోయాయి. కొత్త కొత్త పేర్లతో మద్యం విక్రయాలు జరిగాయి. దీనిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చివరికి ఎవరి డబ్బుతో వారు మద్యం కొనుగోలు చేయడానికి కూడా క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది.

ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ తమను ఇబ్బందులకు గురి చేశారనే అక్రోశం అన్ని వర్గాల మద్యం వినియోగదారుల్లో పెరిగింది. మద్యం బ్రాండ్లపై విపక్షాలు చేసిన ప్రచారం కూడా కలిసొచ్చాయి. మద్యం నాణ్యత, రుచిలో తేడాలు, ఎప్పుడు ఏ బ్రాండ్ మద్యం విక్రయిస్తారో తెలియక పోవడం వంటి కారణాలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి.

ప్రైవేట్ దుకాణాల్లో విక్రయాలు ఫుల్...

ప్రైవేట్ మద్యం దుకాణాల్లో అక్టోబర్ 15 నుంచి విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. అయితే తెరుచుకున్న దుకాణాల్లో మాత్రం మద్యం అన్ని వెరైటీలను అందుబాటులోకి తెచ్చారు. బ్రాందీ, విస్కీ, వొడ్కా, రమ్ము, జిన్‌, బీర్‌ రకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. విజయవాడలో సగటున ప్రతి దుకాణంలో ఐదారు లక్షలకు తక్కువ కాకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి.

బార్‌లలో భారీగా తగ్గిన ధరలు...

ప్రైవేట్ మద్యం దుకాణాల రాకతో బార్‌ అండ్ రెస్టారెంట్లలో మద్యం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ఏపీలో ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకపోయినా మద్యం దుకాణాల్లోనే మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అవసరమైన ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం ధరల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి.

గత ఐదేళ్లుగా ఏపీలో పట్టణ ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలంటే రూ.85లక్షల నుంచి కోటి రుపాయల వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇంత పెట్టుబడి పెడితే వ్యాపారం సరిగా సాగకపోతే నష్టాలు తప్పేవి కాదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను కేటాయించక ముందే బార్ అండ్ రెస్టారెంట్లకు లైసెన్స్‌లను పునరుద్ధరించారు. చాలాకాలంగా మద్యం వ్యాపారంలో ఉన్న వారంతా తమ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మకాలపై ప్రభావం పడింది.

గత ఐదేళ్లుగా బార్ అండ్ రెస్టారెంట్లలో ఎమ్మార్పీపై రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసేవారు.2019కు ముందు ఏసీ బార్‌లలో ఎమ్మార్పీపై రూ.30, నాన్‌ ఏసీ బార్‌లలో రూ.20మాత్రమే అదనంగా తీసుకునే వారు. 2019 ఆగస్టులో కొత్త పాలసీ పేరు వచ్చాక ధరల నియంత్రణ గాలికి వదిలేశారు. ఐదేళ్ళలో ఏనాడు దీనిని నియంత్రించే ప్రయత్నాలు జరగలేదు.

లైసెన్స్‌ ఫీజులు భారీగా చెల్లిస్తున్నందున మద్యం ధరల నిర్ణయం బార్‌లకు వదిలేశారు. దీంతో యథేచ్ఛగా దోపిడీ సాగింది. ప్రస్తుతం మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో బార్‌ అండ్ రెస్టారెంట్లలో లిక్కర్ ధరలు తగ్గిపోయాయి. విజయవాడలో ఏసీ బార్‌లలో ఎమ్మార్పీ మీద రూ.40, నాన్‌ ఏసీలో రూ.30 వసూలు చేస్తారు. పోటీ నేపథ్యంలో ఈ ధరలు మరింత తగ్గించక తప్పదని బార్‌ అండ్ రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నవారు చెబుతున్నారు. పర్మిట్ రూమ్‌లను అనుమతిస్తే గరిష్టంగా రూ.20-30కు మించి వసూలు చేసే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు.

మద్యం ధరలపై అసంతృప్తి...

ఏపీలో మద్యం ధరల్ని నియంత్రిస్తామని, మద్యం దోపిడీని అరికడతామని ఎన్డీఏ కూటమి నాయకులు పలుమార్లు ప్రకటించారు. కొత్త పాలసీలో మద్యం ధరల నియంత్రణ ప్రస్తావన లేకుండానే ప్రైవేట్ దుకాణాలు ప్రారంభం అయ్యాయి. మద్యం ధరలు తగ్గించకపోవడంతో వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ధరలు తగ్గించకపోతే వైసీపీకి టీడీపీకి తేడా ఏముందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లలో రూ.20వేల కోట్ల ఆదాయాన్ని మద్యం విక్రయాలతో సంపాదించాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ధరల తగ్గించడం ఏ మేరకు సాధ్యమో చూడాలి.

Whats_app_banner