ఏపీకి మోస్తారు నుంచి భారీ వర్ష సూచన - మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు-light to heavy rains likely in andhrapradesh on saturday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీకి మోస్తారు నుంచి భారీ వర్ష సూచన - మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు

ఏపీకి మోస్తారు నుంచి భారీ వర్ష సూచన - మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు

ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. శనివారం (ఏప్రిల్ 19) పలు ప్రాంతాల్లో మోస్తారు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని పేర్కొంది.

ఏపీకి వర్ష సూచన (unsplash.com)

అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి... కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాల్లో వర్షాలు….

శనివారం(ఏప్రిల్ 19) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రెండుమూడు చోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,విశాఖ, తూర్పుగోదావరి ,రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విభిన్న వాతావరణం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం(ఏప్రిల్ 18) నంద్యాల జిల్లా దొర్నిపాడులో41.7°C ఉష్ణోగ్రత,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిమీ వర్షపాతం నమోదయిందనట్లు వెల్లడించింది.

శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం,కంచికచర్ల, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు (04) వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే 73 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో తెలిపింది.

తెలంగాణలో వర్షాలు:

మరోవైపు శుక్రవారం సాయంత్రం వేళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల వరద నీరు ఏరులై పారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 21 చెట్లు కోల్పోయాయి. వెంటనే వాటిని తొలగించేందుకు హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టింది.

వరద నీరు నిలబడకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టింది. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలగుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. మరో రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం