Auto Permits: ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటోల రాకపోకలపై విధించిన నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే ఈ నగరాల్లో ఆటోల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పర్మిట్ లేని ఆటోలు నగరంలో ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. మిగిలిన పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల రాకపోకలపై ఆంక్షలు లేవు. విజయవాడకు భౌగోళికంగా ఉన్న పరిమితులు, రోడ్ల విస్తీర్ణం, వాహనాల సంఖ్య, జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆటోల సంఖ్యను పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం అనుమతించిన ఆటోలకంటే రెట్టింపు సంఖ్యలో అవి ఉన్నాయి.
ఈ క్రమంలో రెండు నగరాల్లో పర్మిట్లపై ఆంక్షల్ని రద్దు చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల పరిధిలో కొత్త ఆటోలకు పర్మిట్ల జారీకి పరిమితిపై ఆంక్షల్ని తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వు జారీచేసింది.
ప్రస్తుతం తయారవుతున్న ఆటోలన్నీ బీఎస్-6 ఆటోలు, సీఎన్జీ, ఎల్పీజీ, బ్యాటరీలతో నడిచేవి కావడంతో అవి కాలుష్యాన్ని పెద్దగా వెద్దజల్లడం లేనందున పరిమితిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నార. ప్రస్తుతం విజయవాడలో 8700 ఆటోలు, విశాఖపట్నంలో 8,400 ఆటోలు నడవడానికి అనుమతి ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత 2015లో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలకు చెందిన 4,500 ఆటోలకు అదనంగా అనుమతిం చారు. ప్రస్తుతం విజయవాడలో దాదాపు 18వేల ఆటోలు తిరుగుతున్నాయి.
విజయవాడ, విశాఖపట్నం మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కొత్త ఆటోలకు రిజిస్ట్రేషన్ చేసి, వాటికి పర్మిట్లు ఇస్తు న్నారు. కొత్తగా వస్తున్న బీఎస్-6, సీఎన్జీ, ఎల్పీజీ, బ్యాటరీ ఆపరేటెడ్ ఆటోలు పర్యావరణానికి అనుకూలంగా ఉన్నాయని ఆంక్షలు తొలగిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నగరంలో ఉన్న ట్రాఫిక్‌ను పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆటోలకు పర్మిట్లపై చిరునామాలు మార్చినవి, యజమానుల పేర్ల మార్పులు చేసినవి, ఆర్సీల్లో సవరణలు చేసిన వాటిని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోకి అనుమతించబోమని ఉత్తర్వులో పేర్కొన్నారు.