Lepakshi | యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి.. ఎవరికీ అంతుపట్టని గాలిలో వేలాడే స్తంభం ఉంది ఇక్కడే..-lepakshi in unesco world heritage list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lepakshi | యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి.. ఎవరికీ అంతుపట్టని గాలిలో వేలాడే స్తంభం ఉంది ఇక్కడే..

Lepakshi | యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి.. ఎవరికీ అంతుపట్టని గాలిలో వేలాడే స్తంభం ఉంది ఇక్కడే..

HT Telugu Desk HT Telugu
Mar 29, 2022 09:44 AM IST

అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయం యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలోకి చేరింది. ఇంకో ఆరు నెలల్లో తుది జాబితాను ప్రకటిస్తారు.

<p>లేపాక్షి నంది విగ్రహం</p>
లేపాక్షి నంది విగ్రహం

భారత్ నుంచి .. మూడు ప్రాంతాలకు యునెస్కో వారస్త కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి యునెస్కో జాబితాలో తాత్కాలిక చోటు లభించింది. మరో 6 నెలల్లో.. మరో 6 నెలల్లో వారసత్వ కట్టడాలపై తుది జాబితా విడుదల అవుతుంది. లేపాక్షిలో ఎంతో శిల్ప సంపద నెలవైఉంది. అయితే లేపాక్షి రామాయణ కాలం నుంచి ఉన్నట్టు చెబుతారు. ఇంతకీ అక్కడ విశిష్ఠత ఏంటి?

లేపాక్షి ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించినట్టు అర్థమవుతోంది. నిజానికి లేపాక్షి చిన్న గ్రామమే.. కానీ.. ఇక్కడున్న ప్రాచీన దేవాలయం వలన.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విజయనగర రాజు.. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో పెనుగొండ ప్రాంతానికి చెందిన విరూపన్న తన కులదైవం వీరభద్రుని పేర ఈ ఆలయాన్ని కట్టించాడు. ఈ ఆలయం తూర్పు, పడమర 110 మీటర్లు, దక్షిణం, ఉత్తరం 93 మీటర్లు వరకూ ఉంటుంది. దీని నిర్మాణం క్రీ.శ, 1528 నుండి 1549 వరకు అని ఇక్కడి శాసనాలనుబట్టి అర్థమవుతోంది.

అయితే లేపాక్షికి స్థల పురాణం కూడా ఉంది. రామాయణ కాలం నుంచి.. ఇక్కడ ప్రత్యేకత ఉందని చెబుతుంటారు. పూర్వంలో లేపాక్షి పేరు.. 'కూర్మశైలం' అని. అగస్త్య మహర్షి పాపనాశేశ్వర అనే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఆయన ఇక్కడే గుహలో చాలా కాలంపాటు.. తపస్సు చేసుకున్నట్టు స్థల పురాణం ఉంది. అంతేకాదు.. సీతాపహరణ జరిగిన సమయంలోనూ.. లేపాక్షి గురించిన ప్రస్తావన ఉన్నట్టు చెబుతారు. సీతాపరహరణ జరిగిన తర్వాత... రామలక్ష్మణులు.., చావు బతుకుల్లో జటాయువును చూసి ‘లేపాక్షి’ అని పిలిచారని.. అందుకే.. దీనిపేరు.. లేపాక్షిగా మారిందనే కథ ప్రచారంలో ఉంది.

108 శైవ క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్షికి పేరుంది. అయితే ఇక్కడ ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే.. విరభద్రుడిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ 30 అడుగుల ఎత్తుగల ఏడు తలల నాగేంద్రుడు కూడా ఉన్నాడు. మధ్యలో శివలింగం అద్భుతంగా ఉంటుంది. లేపాక్షికి దగ్గరలోనే.. 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిల నంది విగ్రహం కూడా ఉంది. అయితే దేశంలో ఇదే.. ఎత్తైనదిగా చెబుతారు. లేపాక్షిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆకాశ స్తంభం. సుమారు 8 అడుగుల స్తంభం నేలను తాకకుండా.. పై కప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నాగలింగం వెనక భాగంలో మరో అద్భుతం ఉంది. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మండపం ఉంది. ఇది అసంపూర్తిగా నిర్మించారు. కానీ శిల్పకళ మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది.

అయితే ఇక్కడ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఒక స్తంభం మాత్రం గాలిలో వేలాడుతూ ఉంటుంది. అది ఎందుకు అలా అని ఎవరికీ తెలియదు. ఆలయంలో దాదాపు 70 స్తంభాలు ఉండగా.. అందులో ఒకటి మాత్రమే ఇలా వేలాడుతూ ఉంటుంది. స్తంభం అడుగు భాగంలో ఖాళీ స్థలమే కనిపిస్తుంది. అలా అని స్తంభం మాత్రం కదలదు.

ఇలా లేపాక్షి ఆలయం ఎన్నో విశిష్ఠలతో ఉంది. జీవం ఉట్టిపడేలా.. శిల్ప కళ కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలో భారీ రాతితో చెక్కబడిన నంది విగ్రహాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అంతటి శిల్ప కళా నైపుణ్యంతో లేపాక్షి ఆలయం ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారస్తవ కట్టడాల తాత్కాలిక జాబితాలోకి వెళ్లడంతో.. ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner