CBN Collectors Meeting: సంక్షోభాల్లో అవకాశాలు వెదుక్కోవడమే నాయకత్వం, కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు-leadership is about finding opportunities in crises says chandrababu at collectors meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Collectors Meeting: సంక్షోభాల్లో అవకాశాలు వెదుక్కోవడమే నాయకత్వం, కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

CBN Collectors Meeting: సంక్షోభాల్లో అవకాశాలు వెదుక్కోవడమే నాయకత్వం, కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 11, 2024 12:57 PM IST

CBN Collectors Meeting: ప్రతీ సంక్షోభంలో అవకాశాలుంటాయని, అందులో అవకాశాలు వెతుక్కోవడమే నాయకత్వమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లాల్లో రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

CBN Collectors Meeting: రాష్ట్రంలో విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెదుక్కోవడమే నాయకుల లక్షణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల ఐటీ మంత్రి లోకేష్ అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, దాని ఫలితమే విశాఖకు ఇప్పుడు ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ స్వాగతోపన్యాసంలో వివరించారు.

గతంలో ఐటీ గురించి నిన్నమొన్నా ఏఐ గురించి ఇప్పుడు డీప్ టెక్ అనే సాంకేతికత గురించి మాట్లాడుతున్నామని, విశాఖకు గూగుల్ లాంటి సంస్థలు వస్తే అది గేమ్ చేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సంస్థలు ఏర్పాటైతే ఓ దిక్చూచిగా ఏపీ మారుతుందని చెప్పారు.

రాష్ట్రాన్ని నాలెడ్జి ఎకానమీగా మార్చటం, స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణలు రూపోందించాల్సి ఉందన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌరసేవల్ని సులభంగా అందించేలా గూగుల్ తో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సు సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉంది. ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని, ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారని, మార్పును నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో హెచ్చరికలూ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు.

గతంలో నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఇప్పుడు పెన్షనర్లకూ మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టప్రకారం శిక్షించాల్సిందేనని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయి. అప్పుడే పెట్టుబడులు కూడా వస్తాయని, పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే జిల్లాల మధ్య కలెక్టర్లు కూడా పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుంది సంపదతో మళ్లీ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్టపడాలని ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి, డ్రగ్స్ బ్యాచ్ లు ఉన్నట్టు వెలుగులోకి వస్తోందని, గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాల్సిందేనన్నారు.

జిల్లాల్లో ఈ మాఫియాను కూకటి వేళ్లను పెకిలించేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు, ఇప్పుడు పోర్టులు, సెజ్ లను కూడా కబ్జా చేసేస్తున్నారని, ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అందుకే తీసుకువచ్చినట్టు చెప్పారు.

2047 విజన్ సాధన కోసమే రాష్ట్రంలో 20కి పైగా పాలసీలను తీసుకువచ్చామని, రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ ప్లాన్ అమలు కావాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అమరావతిని రూ.31 వేల కోట్ల రూపాయల మేర నిధులతో నిర్మాణం చేపట్టబోతున్నట్టు కలెక్టర్లకు వివరించారు.

2027కు పోలవరం పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించుకుని ప్రణాళిక అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లకే రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, మూడు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

దీపం 2 కింద 40 లక్షల మందికి లబ్ది కలిగేలా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్టు వివరించారు.

Whats_app_banner