AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు - 10 ప్రధాన అంశాలు
Land Registration Charges in AP: ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విలువలు తగ్గించింది. మరికొన్నిచోట్ల పెంచగా…. ఇంకొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న ధరలోనే కొనసాగించాలని నిర్ణయించింది. సగటున 20 శాతం విలువలు పెరగనున్నాయి.
ఏపీలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. నేటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు ఉండనుండగా.. రాజధాని ప్రాంతంలో యదాతథా ధరలే అందుబాటులో ఉండనున్నాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే వర్తిస్తాయి.
భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు - ముఖ్యమైన అంశాలు:
- ఏపీలో ఫిబ్రవరి 01, 2025 నుంచి ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గించగా.. మరికొన్నిచోట్ల మార్పులు ఉన్నాయి.
- ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ..ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని ఇటీవలే ప్రకటన కూడా చేశారు.
- రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మార్పులు చేర్పులపై కసరత్తు చేసి ఖరారు చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా సగటున 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0 శాతం మాత్రమే ఉంటాయి.
- రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసి… కొత్త ధరలను అమల్లోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
- రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామని ఇటీవలే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఈ నేఫథ్యంలో అలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించారు. ఇక భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 0 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంతో పాటు కోనసీమ, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్నిచోట్ల ఛార్జీలను తగ్గించారు.
- అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే వర్తిస్తాయి.
- ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో జనవరి 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల్లో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత వారం రోజులుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ జనాల రద్దీతో కనిపించాయి.
- అధిక రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో ఈ గురు, శుక్రవారాల్లో కలిపి సుమారు ఏపీ ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. నేటి నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రావటంతో… కొన్ని ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరిగే అకాశం ఉంది.
సంబంధిత కథనం