అమరావతిలో మ‌రో 6 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు - ఏపీ సర్కార్ నిర్ణయం-land allotments to six more institutions in the ap capital amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అమరావతిలో మ‌రో 6 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు - ఏపీ సర్కార్ నిర్ణయం

అమరావతిలో మ‌రో 6 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు - ఏపీ సర్కార్ నిర్ణయం

రాజ‌ధానిలో మ‌రో ఆరు సంస్థ‌ల‌కు భూకేటాయింపుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 74 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

రాజ‌ధానిలో మ‌రో ఆరు సంస్థ‌ల‌కు భూకేటాయింపులు

ఏపీ రాజధాని అమరావతిలో మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులు జరగనున్నాయి. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు.

భూకేటాయింపులకు ఆమోదం…

రాజ‌ధాని భూకేటాయింపుల స‌బ్ క‌మిటీ 18వ స‌మావేశం జ‌రిగింది. మొత్తం 16 అంశాల‌కు గాను 12 అంశాల‌కు స‌బ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 2014-19 మ‌ధ్య కాలంలో భూములు కేటాయించిన ప‌లు సంస్థ‌ల‌కు తిరిగి కేటాయింపుల్లో మార్పులు చేస్తూ సబ్ క‌మిటీ ఆమోదం తెలిపింది.

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ కు రెండు ఎకరాలు అలాగే జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు,స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపుల‌ను కొన‌సాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశామని వివరించారు. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బ‌త్తి సంస్థ‌కు చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కేబినెట్ స‌బ్ క‌మిటీ నిర్ణయం తీసుకుంది.

మూడు రాజ‌ధానుల దెబ్బ‌కు అమ‌రావ‌తి అంటే కొన్ని సంస్థ‌లు భ‌య‌ప‌డి వెళ్లిపోయాయని మంత్రి నారాయణ వెల్లడించారు. గ‌తంలో భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు ఇప్పుడు స‌రిగా స్పందించ‌డం లేద‌న్నారు. తాజాగా అమ‌రావ‌తిలో కొత్త‌గా 10 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేస్తూ మంత్రివ‌ర్గ ఉపసంఘం నిర్ణ‌యం తీసుకుందన్నారు. మొత్తం నాలుగు సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయ‌గా… కొత్త‌గా ఆరు సంస్థ‌ల‌కు స‌బ్ క‌మిటీ కేటాయింపులు చేసింది. అయితే గ‌తంలో కేటాయించిన రెండు సంస్థ‌ల‌కు భూముల కేటాయింపులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు,ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు,ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB) కి 0.5 ఎకరాలు,బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు,బీజేపీ కార్యాల‌యానికి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు వీలైనంత త్వ‌ర‌గా నిర్మాణాలు ప్రారంభిస్తాయ‌ని మంత్రి నారాయణ తెలిపారు. అమ‌రావ‌తిలో ఇప్ప‌టికే ప‌దివేల‌కు పైగా కార్మికులు పనుల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌న్నారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టేనాటికి మొత్తం 20వేల మంది కార్మికుల‌తో ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతాయ‌ని మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.