ప్రభుత్వ శాఖ‌ల మధ్య సమన్వయ లోపం.. అర్హత ఉన్నా రేషన్ కార్డులు దక్కవు.. సర్వర్లలో పాత సమాచారంతో తిప్పలు…-lack of coordination among government departments leads to ration card delays and issues with outdated server informatio ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రభుత్వ శాఖ‌ల మధ్య సమన్వయ లోపం.. అర్హత ఉన్నా రేషన్ కార్డులు దక్కవు.. సర్వర్లలో పాత సమాచారంతో తిప్పలు…

ప్రభుత్వ శాఖ‌ల మధ్య సమన్వయ లోపం.. అర్హత ఉన్నా రేషన్ కార్డులు దక్కవు.. సర్వర్లలో పాత సమాచారంతో తిప్పలు…

Sarath Chandra.B HT Telugu

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినా సాంకేతిక కారణాలతో అర్హులైన వారి దరఖాస్తుల్ని సచివాలయాల్లో తిరస్కరిస్తున్నారు. వాట్సాప్‌లో పౌర సేవల్ని అందించే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల సర్వర్లను సచివాలయాలతో అనుసంధానించక పోవడంతో దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

రేషన్ కార్డుల జారీలో సాంకేతిక సమస్యలు

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్ వారికి గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. పదేళ్ల క్రితం అమ్మేసిన ఫోర్ వీలర్ ఇప్పటికీ వారి పేరుతోనే ఉన్నట్టు చూపించడం, ఎవరిదో తెలియని కరెంటు కనెక్షన్ ఆధార్ కు ‌లింకు అయ్యి ఉందని చెప్పడం, ఎప్పుడో చేసిన వ్యాపారాలకు జిఎస్టీ రిజిస్ట్రేషన్‌, ఐటీఆర్‌ ఫైలింగ్‌ వంటి అంశాలతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు చుక్కలు కనిపిస్తున్నాయి.

రేషన్‌ కార్డు దరఖాస్తుల్లో సాంకేతిక అభ్యంతరాలను సరిచేసుకున్నా గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లలో పాత డేటా చూపించడంతో అర్హత ఉన్నా అనర్హులుగా మిగులుతున్నారు.

ఏపీలో ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ప్రామాణికంగా రేషన్ కార్డుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

కొత్తగా రేషన్ కార్డు పొందాలి అంటే ఒక సంవత్సరం యావరేజ్ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు. పది ఎకరాల లోపు మెట్టభూమి, మూడు ఎకరాల లోపు సాగుకు అనువైన మాగాణి భూమి ఉండొచ్చు. కుటుంబంలోని ఏ ఒక్కరికి ఫోర్ వీలర్ ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. పట్టణ ప్రాంతంలో నివసించే ఇల్లు వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.

ఆరు పాయింట్ల ప్రాతిపదికన...

ఒక వ్యక్తి రేషన్ కార్డు కోసం ఆన్లైన్ లో ఆధార్ ద్వారా అప్లై చేసుకున్న వెంటనే సంబంధిత శాఖల సర్వర్ల ద్వారా వారు అర్హులో కాదో తెలుసుకుంటారు. దరఖాస్తుదారుడి ఆధార్ నంబర్ కొట్టగానే ఆ వ్యక్తి,‌ కుటుంబం సగటున నెలకు 300 కంటే తక్కువ యూనిట్ విద్యుత్తును వినియోగిస్తున్నాడా లేదా అన్నది తెలుసుకుంటారు. మున్సిపల్ పన్ను ఆధారంగా వారు నివసిస్తున్న ఇల్లు ఎన్ని చదరపు అడుగుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది.

అయితే ఇక్కడే అసలు చిక్కులు వచ్చి పడుతున్నాయి. చాలామంది ఆధార్ కు వారికి తెలియకుండానే విద్యుత్ పంపిణీ సంస్థలు లింక్ చేసేశాయి. కొన్ని చోట్ల ఆన్లైన్‌లో వేరే వారి విద్యుత్ కనెక్షన్లను లింక్ చేయడంతో నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించిపోతుంది. ఆన్లైన్ పోర్టల్ లో రేషన్ కార్డు దరఖాస్తుదారుడి వివరాలు ఎక్కించిన వెంటనే వారు అర్హులు కాదు అని సర్వర్ చెప్పేస్తుంది. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటదని చెబుతున్నా దానికి ఆధార్‌ డీ లింక్ చేయాల్సిందేనని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.

విద్యుత్ కనెక్షన్లను ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసే క్రమంలో సంబంధం లేని ఆధార్‌ నంబర్లతో కనెక్షన్లను అనుసంధానించారు. దీంతో అనేకమందికి తమ పేరిట వేరే వారి విద్యుత్ కనెక్షన్లు లింక్ అయి ఉన్నారు అన్న విషయం కూడా తెలియటం లేదు.

సంబంధం లేని కనెక్షన్లు..

“ఇటీవల నా భర్త చనిపోయారు. నా పేరిట రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లాను. అక్కడ నా ఆధార్ ఎంటర్ చేసి విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది మీరు అర్హులు కాదని చెప్పారు. మాది 300 చదరపు అడుగుల చిన్న ఇల్లు అంత వినియోగం ఉండదు అని చెప్పాను. వారు ఆన్లైన్లో చెక్ చేసి నా భర్త ఆధార్ నెంబర్ కు మా ఇంటి విద్యుత్ కనెక్షన్ తోపాటు మరొక ఇంటి విద్యుత్ కనెక్షన్ కూడా లింక్ అయి ఉందని చెప్పారు. ఆ కనెక్షన్ ఎక్కడిదో అని కనుక్కుంటే మా ఇంటికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండే వేరే వారి ఇంటి కనెక్షన్ అని తెలిసింది.

వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో నాలుగు రోజులు తర్వాత సమస్య పరిష్కారం అయిందని మాకు చెప్పారు. కానీ ఇప్పటికీ పది రోజులు గడుస్తున్నా గ్రామ వార్డు సచివాలయ సర్వర్లలో మాత్రం మా పేరిట వేరే వారి విద్యుత్ కనెక్షన్ లింక్ అయి ఉన్నట్టు చూపిస్తున్నారు. సచివాలయానికి వెళ్ళిన వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు,” అని విజయవాడ లోని గుణదల ప్రాంతానికి చెందిన లంక విజయ హిందుస్థాన్ టైమ్స్ కు చెప్పారు.

రవాణా శాఖ జాబితాలో పేర్లు...

రేషన్‌ కార్డు దరఖాస్తుదారుల్లో అనేక మంది రవాణా శాఖ ( ఆర్టీఏ ) సర్వర్ జాబితాలో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. వారి పేరిట తమది కానీ ఫోర్ వీలర్ లింక్ అయి ఉండడంతో లబోదిబోమంటున్నారు. “గతంలో ఆర్థిక ఇబ్బందులు లేని సమయంలో 2012లో నేను ఓ మారుతి కారు కొనుక్కున్నాను. దాన్ని 2018 లోనే వేరే వారికి అమ్మేశాను. రిజిస్ట్రేషన్ నేమ్ చేంజ్ పక్కాగా చేసి కార్ అమ్మాను. ఇటీవల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఆధార్ చెక్ చేసి నా పేరు మీద కారు ఉంది నేను అర్హుడ్ని కాదు అని చెప్పారు. వెంటనే ఆర్టిఏ శాఖకు వెళ్లి కనుక్కున్నాను. అక్కడ రికార్డులో నా పేరు మీద కార్ లేనట్లు కనబడుతుంది. ఈ సమస్యను వార్డు సచివాలయంలో వివరించగా సర్వర్లలో డేటా అప్డేట్ చేయడం అన్నది తమ చేతిలో లేని పని అని తామేం చేయలేమని సమాధానం ఇచ్చారు” అని విజయవాడ రాజరాజేశ్వరి పేట కు చెందిన సోమశేఖర్ తెలిపారు.

సచివాలయాల్లో పరిష్కారం దక్కదు…

ఇదే తరహా సమస్యలు జిఎస్టీ చెల్లింపులు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి కూడా ఎదురవుతున్నాయి. గతంలో వ్యాపారాలు చేసి నష్టపోయిన వారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఐటీ రిటర్నులు వేసిన వారికి కూడా రేషన్‌ కార్డులు రావడం లేదు. ఇప్పుడు వ్యాపారాలు చేయడం లేదు, ఐటీ చెల్లింపులు లేవని చెబుతున్నా అనర్హులుగానే మిగిలిపోతున్నారు.

రేషన్‌ కార్డుల జారీలో ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం పై హిందుస్థాన్ టైమ్స్ క్షేత్రస్థాయిలో ఆరా తీయగా సంబంధిత శాఖలు తమ సర్వర్లలో తప్పులను సరి చేసినా గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లు రియల్ టైంలో అప్డేట్‌ కావడం లేదు.దీంతో అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు దక్కకుండా అనర్హులుగా మిగిలిపోతున్నారు.

సచివాలయాల్లో ఫిర్యాదులు తీసుకోరు..పరిష్కరించరు…

గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తులను నమోదు చేసే మెకానిజం మాత్రమే ఉంది తప్ప, తప్పుడు వివరాలు ఉంటే వాటిని సరి చేసే ఆప్షన్‌ లేదు.ఇలాంటి సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

గ్రామ వార్డు సచివాలయ శాఖ తక్షణం దీనిపై స్పందించి సర్వర్లలో తప్పులు వల్ల రేషన్ కార్డుకు అర్హత కోల్పోతున్న వారికి వివరాలు మాన్యువల్‌గా అయినా చెక్ చేసి వారికి రేషన్ కార్డ్ ఇవ్వాలని రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు కోరుతున్నారు

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం