Kurnool TDP Leader Murder : వేటకొడవళ్లతో దాడి, కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ఫ్యాక్షన్ దాడులపై లోకేశ్ సీరియస్
Kurnool TDP Leader Murder : కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఓ హత్యకు దారితీసింది. వైసీపీ నేతలు టీడీపీ గిరనాథ్ చౌదరిని వేటకొడవళ్లతో హత్య చేశారు. ఈ ఘటనపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Kurnool TDP Leader Murder : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజకీయ పార్టీల మధ్య చిన్నపాటి ఘర్షణే హత్యకు కారణం అయింది. ఏకంగా వేట కొడవళ్లతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తపై దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీకి చెందిన యువ కార్యకర్త హతం అయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో పోలింగ్ రోజు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు కొట్టారు. ఇదిలా జరుగుతుండగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో అక్కడికి ఆ వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. అయితే వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మాత్రం దాన్ని మనసులోనే పెట్టుకున్నారు.

అసలేం జరిగింది?
ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి (35) తన సోదరుడు కల్యాణ్‌తో కలిసి వైసీపీ నాయకుడు రమేష్ ఇంటివైపు వెళ్లారు. ఇటువైపు ఎందుకు వచ్చావంటూ గిరినాథ్ చౌదరిని రమేష్ నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే రమేష్ తన అనుచరులతో కలిసి గిరినాథ్ చౌదరి, ఆయన సోదరుడు కల్యాణ్‌పై వేటకొడవళ్లతో దాడి చేశారు. గిరినాథ్ చౌదరికి బలమైన గాయాలయ్యాయి. ఆయన తలపై బలమైన గాయాలు అయ్యాయి. సోదరుడు కల్యాణ్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన గిరిని కుటుంబ సభ్యులు వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే గిరి మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు పరీక్షించి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లబోదిబోమని కన్నీరు మున్నీరు అయ్యారు. వారి ఆర్తనాదాలతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామంలో ఉద్రిక్తత
మృతుడు గిరినాథ్‌కు భార్య భార్గవి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గిరినాథ్ హత్యకు కారణం వైసీపీ నేతలు రామకృష్ణ, రమేష్, చిన్నపామయ్య, మధుసూదన్ రెడ్డి, చక్రపాణిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కంగాటి రామ్మోహన్ రెడ్డితో పాటు మరి కొందరు ఉన్నారని గిరినాథ్ తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలకు చెందిన రెండు గడ్డివాములు, ద్విచక్ర వాహనాన్ని టీడీపీ వర్గీయులు కాల్చివేశారు. విషయం తెలుసుకున్న సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ పి.చంద్రశేఖర్ రెడ్డి బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరించి, వారిపై కేసు నమోదు చేశారు. అలాగే ఎస్పీ జి.కృష్ణకాంత్ కూడా గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తావివ్వకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. నిందితులు పరారీలు ఉన్నట్లు తెలిసింది.
హత్యా రాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు
ఈ ఘటనపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నారన్నారు. హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామని, శాంతిభద్రతలు కాపాడుతామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం