Diamond In Kurnool : అబ్బా అదృష్టమంటే ఈ రైతుదే.. పొలంలో దొరికిన వజ్రం.. అమ్మితే?
అదృష్టం కొన్నిసార్లు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అద్భుతం జరిగిపోతుంది అంతే. రావాలి.. రావాలి అనుకుంటే రాదు కదా. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఓ రైతు కుటుంబానికి అదృష్టం వజ్రం రూపంలో వచ్చింది.
లచ్చిందేవికి ఓ లెక్క ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. వచ్చి మన లెక్కంతా సెట్ చేసేస్తుంది. అలాంటి అద్భుతమే ఓ పేద రైతు కుటుంబంలో జరిగింది. ఒక్క వజ్రం తమ జీవితాలను మార్చేసింది. ఇంతకీ ఈ విషయం జరిగింది ఎక్కడా అనుకుంటున్నారా? మన ఏపీలోని కర్నూలు జిల్లాలోనే. వేసిన పంటకు ధర రాలేదని బాధపడుతున్న ఆ రైతు కుటుంబాన్ని లక్ష్మీదేవి పలకరించింది. పొలంలో కలుపు తీస్తుండగా లక్షల విలువ చేసే వజ్రం దొరికింది.
అసలు విషయంలోకి వెళ్దాం. అప్పుడప్పుడు.. కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట అని వార్తలు చదువుతూనే ఉంటారు. వర్షాలు కురిసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు. పొలాల్లో తిరుగుతూ చాలా ఏకాగ్రతతో వెతుకుతారు. అదృష్టం ఉంటే వజ్రం దొరుకుతుంది లేదంటే లేదు. కర్నూలు జిల్లా తుగ్గలి, పెరవలి, జొగన్నగిరి ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు వానవస్తే జాలు పొలాల్లోకి వెళ్తారు. ఒక్క వజ్రమైన దొరికి లైఫ్ సెట్ కాదా అనే ఆశ. కానీ ఓ రైతు కుమార్తె పొలంలో తన పని.. తాను చేసుకుంటుండగా వజ్రం దొరికింది.
తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుమార్తె టామాటా తోటలో కలుపు తీస్తోంది. ప్రకాశవంతంగా మెరుస్తున్న రాయి కనిపించింది. వెంటనే వెళ్లి తీసుకుంది. విషయాన్ని ఇంట్లో చెప్పింది. అప్పటికే ఆ ప్రదేశంలో వజ్రాల వేట చేస్తారని ఆ కుటుంబానికి తెలుసు. సో.. వజ్రమేనని కన్ఫామ్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వ్యాపారులు రైతుతో మాట్లాడారు. సిండికేట్ గా ఏర్పడి.. వజ్రాన్ని ఏకంగా రూ.34 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.
జొన్నగిరి ప్రాంతంలో ఎప్పటి నుంచో వజ్రాలు వేట జరుగుతుంది. వజ్రం దొరకడం ఇది మెుదటిసారేం కాదు. గతంలోనూ వానలు కురిసిన తర్వాత రైతులకు వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది ఓ రైతుకు ఏకంగా రూ.కోటి విలువై వజ్రం లభ్యమైంది. అప్పట్లో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. వర్షాకాలంలో వజ్రాలు, రంగురాళ్లను వెతుక్కుంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వ్యక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ సంవత్సరం జొన్నగిరిలో బయటి వ్యక్తులు, వజ్రాల వేటగాళ్ళు వ్యవసాయ భూములకు రాకుండా రైతులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు.