Kurnool News : అట్టపెట్టెలతో చితి, భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య!-kurnool district pattikonda woman funeral to husband in home with cotton boxes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kurnool District Pattikonda Woman Funeral To Husband In Home With Cotton Boxes

Kurnool News : అట్టపెట్టెలతో చితి, భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య!

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 01:48 PM IST

Kurnool News : కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త మృతదేహాన్ని ఇంట్లోనే అట్టపెట్టెలతో దహనసంస్కారాలు చేసింది భార్య. భర్త చనిపోయాడని తెలిస్తే కొడుకులు ఆస్తి కోసం గొడవ పడతారని, అందుకే ఇలా చేశానంటోంది ఆ మహిళ.

ఇంట్లోనే భర్త మృతదేహానికి దహనసంస్కారం
ఇంట్లోనే భర్త మృతదేహానికి దహనసంస్కారం

Kurnool News : కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త మృతదేహానికి ఇంట్లోనే దహన సంస్కారాలు చేసింది భర్య. తండ్రి చనిపోయాడని తెలిస్తే కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారనే భయంతో ఇంట్లోనే భర్తకు అంతిమ సంస్కరాలు చేసినట్లు ఆ మహిళ చెబుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండకు చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ (60), లలిత భార్యాభర్తలు, వీరికి స్థానికంగా మెడికల్‌ షాపు ఉంది. దానిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. హరికృష్ణ ప్రసాద్, లలితకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అట్టపెట్టెలతో భర్త దహనసంస్కారాలు

అయితే సోమవారం ఉదయం హరికృష్ణ ప్రసాద్‌ ఇంట్లోంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో హరికృష్ణ ప్రసాద్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య లలిత దహన సంస్కారాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన భర్త సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు లలిత పోలీసులకు తెలిపింది. కుమారులిద్దరూ తమను పట్టించుకోవడంలేదని, ఆస్తి కోసం తరచూ గొడవపడుతున్నారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే ఆస్తి కోసం గొడవ చేస్తారన్న భయంతో.. ఇంట్లోనే అట్టపెట్టెలతో భర్త దహన సంస్కారాలు చేశానని లలిత పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరెదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సజీవదహనం చేసినట్లు అనుమానాలు

అయితే ఈ ఘటనపై స్థానికులు కొందరు... భర్తను సజీవదహనం చేసిందని ఆరోపిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరికృష్ణకు సేవ చేయలేక, భార్య లలిత అతడిని బతికుండగానే నిప్పుపెట్టి, దహనం చేసిందని అంటున్నారు. హరికృష్ణ కొన్నేళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టాడంటున్నారు. కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణను చాలాకాలంగా భార్య లలిత చూసుకుంటుందని తెలిపారు. వీరి ఇద్దరు కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. కొడుకులు పట్టించుకోకపోవడం, తాను కూడా భర్తను చూడలేని ఇంట్లోనే అట్టపెట్టెలతో భర్తను దహనం చేసిందని స్థానికులు అంటున్నారు. అయితే లలిత మాత్రం తన భర్త గుండెపోటుతో మరణించాడని చెబుతోందంటున్నారు. భర్త చనిపోయిన తర్వాతే దహనసంస్కాలు చేశానని చెబుతోంది భార్య లలిత. పోలీసులు సజీవదహనం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point