Boy Fell Down In Sambar : చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఫోన్, గేమ్ ఆడుతూ సాంబార్ లో పడి బాలుడు మృతి
Boy Fell Down In Sambar : కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ...సాంబార్ గిన్నెపై కూర్చొన్న బాలుడు, ప్రమాదవశాత్తు వేడి సాంబార్ లో పడిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స బాలుడు మృతి చెందాడు.
'మొబైల్ భూతం' చిన్నారుల ప్రాణాలు తీస్తుంది. ఎంతో మంది చిన్నారులు సెల్ ఫోన్ స్క్రీన్ లకు అతుక్కుపోయి...బాల్యాన్ని మొబైల్ బానిసలుగా గడుపుతున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతుంది. కాసేపు ఏడుస్తు్న్నారనో, మారం చేస్తున్నారనో...పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ పెడుతున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేమూగోడులో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్ మునిగిపోయిన ఓ బాలుడు మృత్యుఒడికి చేరిన ఘటన ఇది. మేనమామ పెళ్లి కోసం అమ్మనాన్నలతో కలిసి బాలుడు జగదీష్ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు. పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు. మొబైల్ లో గేమ్ ఆడుతున్న జగదీష్... చూసుకోకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. గిన్నె మూత పక్కకు జరగడంతో బాలుడు వేడిగా ఉన్న సాంబార్ లో పడిపోయాడు. బాలుడి కేకలు విన్న బంధులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి... కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడ్ని రక్షించేందుకు వైద్యులు ఎంత శ్రమించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
బాలుడ్ని ఢీకొట్టిన ఫార్మా బస్సు
అనకాపల్లి జిల్లాలో ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బాలుడిని ఫార్మా బస్సు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అగనంపూడి సమీపంలో బీసీ కాలనీ వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మామిడిపల్లికి చెందిన దొగ్గ దేముళ్ల ఫార్మాసిటీలో పనిచేస్తూ స్థానికంగా కుటుంబంతో నివసిస్తున్నారు. రోజు లాగానే శనివారం ఉదయం ఆయన డ్యూటీకి బయలుదేరారు. తండ్రితో పాటు దగ్గర్లోని బస్టాప్‌నకు వెళ్లిన బాలుడు పవన్ కుమార్ నేషనల్ హైవేపై డివైడర్‌ను దాటి తిరిగి ఇంటికి వస్తుండగా ఫార్మాసిటీ నుంచి వస్తున్న ఓ ఫార్మా సంస్థ బస్సు వేగంగా ఢీకొంది. బాలుడి తల పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. పవన్ కుమార్ స్థానికంగా గల ఓ ప్రైవేటు స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. విగతజీవిగా పడి ఉన్న బాలుడ్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.