Kuppam Solar Energy: కుప్పంలో ప్రతి ఇంటికి పూర్తి రాయితీతో సోలార్ ఎనర్జీ ఏర్పాటు, తగ్గనున్న బిల్లుల భారం
Kuppam Solar Energy: రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ప్రతి ఇంటికి సోలార్ అందిస్తామన్నారు.
Kuppam Solar Energy: పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వంద శాతం రాయితీతో సౌర ఫలకలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్స్ అమర్చుతామన్నారు. ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని మా చిన్నప్పుడు కరెంటు సరిగా ఉండేది కాదని లాంతర్ల దగ్గర చదువుకునేవాళ్లం అన్నారు. కరెంటు ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. దాన్ని మనం వాడుకునేవాళ్లమని కరెంటు పోతే బాధతో తిట్టేవాళ్లం అన్నారు.
మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చిందని రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్టు వివరించారు, సోలార్, విండ్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని వీటి వల్ల కరెంటు ఉత్పత్తి చేస్తే చార్జీలు తగ్గుతాయన్నారు. 100 శాతం సోలరైజేషన్ చేసేందుకు అధునాతన కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన ఐఐటీ కాన్పూర్ వారిని అభినందించారు.
మన ఇంటిపైనే విద్యుత్ తయారీ
- సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సబ్సిడీ వస్తుంది. ఒక్కో కిలో వాట్ కు రూ. 30 వేలు చొప్పున రూ. 60 వేలు ఇస్తారు.
- అయితే రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తికి రూ. లక్షా 10 వేలు ఖర్చవుతుంది. దీనివల్ల నెలకు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరు 60 యూనిట్లు కరెంటు వాడితే రూ. 200 నుంచి 300 బిల్లు కడుతున్నారు. మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకుని మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్ కు ఇవ్వొచ్చు.
- నాలుగైదు ఏళ్లు మీరు ఉత్పత్తి చేసిన కరెంటును గ్రిడ్ కు ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితంతో పాటు, ఐదేళ్ల తర్వాత ఆ ప్యానెళ్లు మీ సొంతమవుతాయి. పైగా మీకు ఏడాదికి రూ.5 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానెల్స్ పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది. సోలార్ తో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వొచ్చు.
కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం
క్యాన్సర్ వంటి వాటికి కాలుష్యమే కారణం. మనం తినే తిండి, పీల్చే గాలి మొత్తం కాలుష్యమేనని ఎరువులతో పండించిన పంట తిని మనం రోగాలబారిన పడుతున్నామన్నారు. పొల్యూషన్ లేకపోతే 100 ఏళ్లు జీవించవచ్చని .. ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం వేయడంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. చెట్లను పెంచాలి. ఆ గాలి పీల్చితే ఆరోగ్యం బాగుంటుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో కొన్ని చోట్ల 1200 అడుగుల లోపల నీరు ఉందని వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది జూన్ నాటికి హంద్రినీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజక వర్గానికి తీసుకొస్తాము. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి చార్జింగ్ స్టేషన్లు పెడతామన్నారు.