CBN In Kuppam: ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం, నియోజక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇకపై జన నాయకుడు కార్యక్రమం
CBN In Kuppam: కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణకుప్పం విజన్ -2029 డాక్యుమెంట్ రూపొందించినట్టు చంద్రబాబు ప్రకటించారు. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అందరికీ విద్య వంటి 10 అంశాలకు విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
CBN In Kuppam: కుప్పం పర్యటనలో మదర్ డెయిరీ, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తనను ఈ స్థాయికి తెచ్చిన కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం తయారుకావాలని మరో మూడు నెలల్లో కుప్పానికి వస్తానని కడా ఆధ్వర్యంలో కుప్పంలో చేపట్టే అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92.22 కోట్లు మంజూరు చేశామన్నారు. అందులో రూ. 22 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెస్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
ఐదేళ్లుగా ఈ ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. రూ.20 కోట్ల వ్యయంతో కుప్పంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. రూ.10 కోట్ల వ్యయంతో కుప్పంలో 10 జంక్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారులను సుందరీకరిస్తామని చెప్పారు. విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.19 కోట్ల వ్యయంతో పార్కులను అభివృద్ధి చేయబోతున్నామనన్నా.
కుప్పం నియోజకవర్గంలో గుంతల రోడ్లు కనపడకూడదని, రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ. 34.27 కోట్లు మంజూరు చేశామననారు. శాంతిపురం పరిధిలో మదర్ డెయిరీకి 41 ఎకరాల 21 సెంట్లు ఇచ్చామన్నారు. రూ. 105 కోట్ల వ్యయంతో రాబోతున్న ఈ డెయిరీ వల్ల 4 వేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో మరో 4 వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.
కుప్పం పరిధిలో రూ.22 కోట్ల వ్యయంతో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. డ్వాక్రా ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాను. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అలీప్ సంస్థ సహకారంతో మహిళలకు పలు ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తారన్నారు.
టాటా సహకారంతో మెరుగైన వైద్య సేవలు
కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్న కడా అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. కుప్పాన్ని టూరిజం హబ్ గా మారుస్తానని కుప్పం ప్రజలు కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాను. ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు రాబోతున్నాయి. కుప్పంలో కార్గో ఎయిర్ పోర్టు రాబోతోందన్నారు. ఇక్కడి ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తున్నామని టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజా సమస్యల కోసం జన నాయకుడు…
ప్రజల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా కుప్పంలో సరికొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దానిపేరే జన నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే చెప్పిన సీఎం సొంత నియోజకవర్గానికి నిత్యం అందుబాటులో ఉండటం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఇప్పటికే చంద్రబాబు తనకున్న వ్యవస్థను ఉపయోగించి దృష్టికి తీసుకొచ్చిన వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం మనం ఇప్పటి వరకూ చూశాం. అయితే ఈ సారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ప్రజలు వచ్చి నేరుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజానాయకుడు పేరుతో పార్టీ కార్యాలయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల స్టేటస్‌ను తన డ్యాష్ బోర్డులో కూడా చూసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఈ జన నాయకుడు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కార్యాలయంలో నియమించారు. తమ సమస్యలపై అర్జీలతో పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలను సాదరంగా సంబంధిత సిబ్బంది రిసీవ్ చేసుకుంటుంది. సమస్యలపై వచ్చారు కదా అని కసురుకోకుండా కూర్చోబెట్టి వారికి తాగడానికి ఓ కాఫీ లేదా టీ ఇచ్చి గౌరవంగా చూస్తారు. వచ్చిన వారిని వారి సమస్యను జననాయకుడు అనే అప్లికేషన్‌లో రాస్తారు. ఇక్కడ ఐదుగురు ఎంగేజ్మెంట్ అధికారులు ఉంటారు. వీరికిలో ఒక్కొకరికి ఆరు విభాగాలు కేటాయించారు.
ఎంగేజ్మెంట్ ఆఫీసర్లు ప్రజల సమస్యను ఓపిగ్గా విని పోర్టల్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిష్కరించదగిన సమస్యలైతే వాటిని PGRSకి పంపిస్తారు. పార్టీ తరపున చేయవలసిన పనులైతే వెంటనే పార్టీ నాయకత్వం దృష్టి సారించి చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రసీదు కాపీపై బాధితులకు తెలియజేస్తారు. రసీదు ఇచ్చేశాం...మా పని అయిపోయిందన్నట్లు కాకుండా దీనికి మరో ప్రత్యేక టీం కూడా ఉంటుంది. అదే ఫాలోఅప్ టీం. ఈ ఫాలోఅప్ టీం సంబంధిత అధికారులను నిత్యం సంప్రదిస్తూ సమస్యను సకాలంలో పరిష్కరమయ్యేలా చూస్తారు.
నేరుగా ముఖ్యమంత్రి పరిశీలించేలా
ప్రతి అర్జీ, పరిష్కారం ఎంత వరకు వచ్చిందనేది నేరుగా సీఎం చూసేలా డాష్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయా...లేదా అన్నదాన్ని సీఎం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేరుగా అక్కడికి రాలేని వాళ్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా జన నాయకుడుకు వచ్చిన సమస్యల పరిష్కారంపై కాల్ సెంటర్ నుంచి అర్జీదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. సంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుంటారు.