KRMB Letter to AP : సాగర్‌ నుంచి నీటి విడుదల ఆపండి.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ-krmb writes letter to andhrapradesh govt over water released from sagar dam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krmb Letter To Ap : సాగర్‌ నుంచి నీటి విడుదల ఆపండి.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ

KRMB Letter to AP : సాగర్‌ నుంచి నీటి విడుదల ఆపండి.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు లేఖ

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2023 04:32 PM IST

KRMB Letter To Andhrapradesh Govt: సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారింది. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (KRMB) ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

KRMB Letter To Andhrapradesh: ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసంది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. అక్టోబర్‌ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. అయితే ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పోలీసుల కేసు

నాగార్జున సాగర్‌ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్‌ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు బలవంతంగా చొచ్చుకు రావడంపై ఎస్పీఎఫ్‌ సిబ్బంది, ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు. సిసి కెమెరాలు ధ్వంసం చేసి, తమ భూభాగంలో బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 447, 427 కిందతెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

నాగార్జున సాగర్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. బుధవారం రాత్రి నుంచి నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొన సాగుతున్నాయి. 13వ నంబర్‌ గేట్‌ వరకు ఏపీ కుడి కాలువకు బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 520 అడుగులకు చేరింది. గురువారం నుంచి సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేస్తోంది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్‌ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నాు. డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి.

బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్‌ నుంచి డ్యామ్‌పైకి వందలాది మంది పోలీసులు ప్రవేశించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్‌ సెక్యూరిటీ గేట్ల పై నుంచి లోపలకు దూకి, గేట్‌ మోటర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు తెలంగాణ ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రయత్నించినా ఏపీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సాధ్యపడ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు అక్రమంగా చొరబడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.