Prakasam Barrage: కడలివైపు కృష్ణమ్మ పరుగులు, రెండున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం
Prakasam Barrage: ఓ వైపు వర్షాలు మరోవైపు వరద ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తీస్తూ సముద్రం వైపు సాగుతోంది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
Prakasam Barrage: కృష్ణా నదిలో వరద ప్రవాహకం కొనసాగుతోంది. కృష్ణానది వరద ప్రవాహం చేరుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండి కూర్మనాథ్ కోరారు. బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.
బుధవారం సాయంత్రం 7 గంటల నాటికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం, సాగర్ నుంచి నీటి విడుదల దిగువకు ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ తర్వాత నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో సముద్రంలోకి వదులుతున్నారు.
సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 47600 ఔట్ ఫ్లో 47,235 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.32 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 3.51లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 2.88లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి,కృష్ణా నదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పెరిగిన వరద ఉధృతి…
ప్రకాశం బ్యారేజ్ వద్ద గురువారం ఉదయానికి కృష్ణానది వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు.
వరద ప్రవాహాన్ని పరిశీలించిన చంద్రబాబు…
విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తూ సీఎం చంద్రబాబు మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం.. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. దీంతో పలువురు సందర్శకులు సీఎంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణమ్మకు జలకళ రావడం చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.