Cyclone Effect Schools Holiday : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్, రేపు కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు
Cyclone Effect Schools Holiday : మిచౌంగ్ తుపాను దృష్ట్యా కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు- అధికారులు అలర్ట్
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిచౌంగ్ తుపాన్ కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టవలసిన చర్యలపై సీఎం జగన్ సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం సేకరణపై
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మిచౌంగ్ తుపాను తీరం దాటే సమయంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ హెచ్చరికలను పరిగణలోని తీసుకుని అధికారులందరూ అప్రమత్తంతో ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లా రైతులు వరికోతలు చేపట్టకుండా నివారించామన్నారు. 41,163 హెక్టారులలో రైతులు వరి పంటను సాగుచేశారన్నారు. ఇందులో 6,620 హెక్టారులో వరికోతలు కోశారని, 45,108 మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి కాగా ఇందులో 12,993 మెట్రిక్ టన్నులు బహిరంగ మార్కెట్ ద్వారా రైతులు విక్రయించారని తెలిపారు. మరో 28 వేల మెట్రిక్ టన్నులు గోడౌన్లకు సురక్షిత ప్రాంతాలకు తరలించారని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 2,391 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామన్నారు. ఈ నెల 3వ తేదిన వాతావారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 324 మెట్రిక్ టన్నులు ఆఫ్లైన్, 200 మెట్రిక్ టన్నులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
తేమ శాతం ఉన్నా ధాన్యం కొనుగోలు
1200 మెట్రిక్ టన్నులు ధాన్యం కుప్పలు వేసి ఉందని వాతావారణం అనుకూలించిన వెంటనే తేమ శాతం ఉన్నప్పటికి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి సమీపంలో నివాసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ డ్రైన్స్ పై దృష్టి పెట్టి వర్షపు నీరు పారేలా చర్యలు తీసుకుని నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్ పై దృష్టి పెట్టి హోర్డింగ్ దెబ్బతిన్నప్పటికి సమీపంలో ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలలో పూరిగుడిసెలు, పురాతన గృహాలను గుర్తించి నివాసితులను అప్రమత్తం చేయాలన్నారు. విపత్కర పరిస్థితులలో ఎదురై బాధితులను తరలించవలసి వస్తే ముందుగానే పునరవాస కేంద్రాలను గుర్తించి మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు.