Krishna Crime : కృష్ణా జిల్లాలో ఘోరం, మూడో తరగతి విద్యార్థిని తొడ కొరికిన కీచక ఉపాధ్యాయుడు
Krishna Crime : కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందతున్నాడు. బాలిక తొడపై కొరికాడు.
కృష్ణా జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సి ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని విద్యార్థిని తొడ కొరికి, విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో పాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు విద్యా శాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు.
బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.
ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారని బాలిక చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసకున్నారు. అలాగే వేణుగోపాలరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడేపల్లిలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
తాడేపల్లి రూరల్ కుంచనపల్లి గీతాంజలి పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం స్కూల్‌కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. కుంచనపల్లి గీతాంజలి పబ్లిక్ స్కూల్‌లో పని చేస్తున్న నవీన్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యానికి నాలుగు రోజుల క్రితం పలు తరగతుల విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సోమవారం మంగళగిరికి చెందని విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతనికి పెళ్లి అయి ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలియడంతో నీ పిల్లల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నావా? అంటూ ఓ తల్లి అతడిని చెప్పు తీసుకుని కొట్టింది. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి మాట్లాడుతూ ఇలా జరగడం చాలా బాధాకరమని, ఇప్పటికే విద్యార్థులకు పలుసార్లు అవగాహన కల్పించామని అన్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తే తమకు తెలియజేయాలని చెప్పామని, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం