Konaseema Crime : ప్రేమ పేరుతో వేధింపులు, బాలుడిపై బ్లేడ్‌తో దాడి చేసిన బాలిక తండ్రి
Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తన కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలుడిపై బాలిక తండ్రి బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Konaseema Crime : అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతోన్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలుడిపై బాలిక తండ్రి బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి బలమైన గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ముమ్మిడివరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముమ్మిడివరంలో ఒక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న ఓ బాలికను, ఆ పాఠశాలకు ఎదురుగా ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న బాలుడు పరిచయం చేసుకున్నాడు. బాలిక తమ కుటుంబ సభ్యులతో కలిసి చర్చికి వెళ్తున్న సమయంలో పరిచయం పెరిగింది. ఇలా తరచూ బాలికతో బాలుడు మాట్లాడేవాడు.
కొన్ని రోజులుగా బాలికను బాలుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, అతడి తల్లిదండ్రులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేశారు. దీంతో వారు బాలుడిని మందలించారు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ బాలుడి తీరులో మార్పు రాలేదని, మంగళవారం కూడా వేధించాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో బాలిక తండ్రి కోపానికి లోనై బాలుడిపై దాడి చేశాడు.
బాలుడు మంగళవారం సాయంత్రం ముమ్మిడివరంలోని బేకరి వద్ద స్నాక్స్ కొనుగోలు చేస్తుండగా బాలిక తండ్రి వచ్చి బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాలుడు కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు చుట్టుముట్టారు. గాయాలతో విలవిలాడుతున్న బాలుడిని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తున్నారు. దాడి చేసిన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులు వివరించాడు. బాలుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీబీ స్వామి ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు.
బాలుడిపై పోక్సో కేసు నమోదు
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడిపై పోక్సో కేసు నమోదు అయింది. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో చోటు చేసుకుంది. పెదవేగి ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో బాలుడు, బాలిక ఒకే తరగతి (8వ తరగతి) చదువుతున్నారు. అయితే బాలిక పట్ల బాలుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాలిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేసింది.
బాలుడి ప్రవర్తనపై ఆరా తీసిన ప్రధానోపాధ్యాయురాలు, బాలిక ఫిర్యాదులో నిజం ఉందని భావించారు. దీంతో నెల రోజుల క్రితమే బాలుడికి టీసీ ఇచ్చి పంపించేశారు. టీసీ ఇచ్చి పంపించేయడంతో ఆ బాలికపై కక్షపెట్టుకున్నాడు బాలుడు. ఆమె వల్లే తనకు టీసీ ఇచ్చేశారని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బాలుడు అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా బాలిను కాలితో తన్నాడు.
స్థానికులు గమనించి అక్కడికి పరిగెత్తారు. దీంతో అది గమనించిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తి అయిన తరువాత చర్యలు ఉంటాయని అన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం