జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు-kommineni srinivasa rao arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

HT Telugu Desk HT Telugu

సాక్షి టీవీలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

కొమ్మినేని శ్రీనివాసరావు

సాక్షి టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగంపై ఆయనను అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న కొమ్మినేని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.

సాక్షి టీవీలో చర్చా కార్యక్రమంలో సందర్భంగా అసభ్యకరంగా మాట్లాడారంటూ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, పలువురు మహిళల ఫిర్యాదు మేరకు కొమ్మినేనిపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ వ్యవహారంలో కొమ్మినేనితోపాటు సాక్షి యాజమాన్యం, జర్నలిస్టు కృష్ణం రాజుపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు

రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన ఈ అంశంపై సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేశారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

‘ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం..’ అని పేర్కొన్నారు.

‘వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం..’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

‘రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది..’ అని తెలిపారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.