Tirumala : జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు..!-koil alwar tirumanjanam will be held at srivari temple on january 7 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు..!

Tirumala : జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 25, 2024 05:08 PM IST

Koil Tirumanjanam at Tirumala 2025 : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీన బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 19వ తేదీ వరకు ఈ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభం సందర్భంగా… జనవరి 7వతేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

yearly horoscope entry point

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

7న తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు :

  • జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
  • ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.
  • ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.
  • శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.
  • అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
  • జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు.
  • జనవరి 6వ తేది ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

టీటీడీ విస్తృత ఏర్పాట్లు :

తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పురష్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దవుతాయి. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం