Ganesh Nimajjanam: నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు-khairatabad ganesh idol left for immersion traffic restrictions in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganesh Nimajjanam: నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Nimajjanam: నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 17, 2024 07:47 AM IST

Ganesh Nimajjanam: వేలాదిమంది భక్తులతో ఖైరతాబాద్‌ గణేషుడు నిమజ్జనానికి బయల్దేరాడు. భాగ్యనగరమంతట గణేష్‌ విగ్రహాలు నిమజ్జనానికి బయల్దేరడంతో కోలాహలంగా ఉంది. బాలాపూర్‌ గణేష్‌ విగ్రహం లడ్డూ వేలం పాట నిర్వహణ తర్వాత నిమజ్జనానికి బయల్దేరనుంది.

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం
నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం

Ganesh Nimajjanam: హైదరాబాద్‌ నగరం గణేష్‌ నిమజ్జనాలతో కోలాహలంగా మారింది. నగరంలోనే అత్యంత పెద్దదైన ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం కోసం బయల్దేరింది. ఉదయం ఆరున్నరకే శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటల్లోగా శోభాయాత్ర పూర్తి చేయాలని భావిస్తున్నారు. గణేష్‌ ఉత్సవ సమితి నిమజ్జనానికి ముందు నిర్వహించే పూజలు పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామునే విగ్రహం హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం కోసం బయల్దేరాడు. మంగళవారం ఉదయం 7లోపు దాదాపు 5వేల చిన్నాపెద్ద విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

మరోవైపు నిమజ్జనాలకు హైదరాబాద్‌లో వేలాదిమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఓ వైపు గణేష్‌ నిమజ్జనం మరోవైపు సెప్టెంబర్‌ 17 కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు.

నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. హుస్సేన్​సాగర్​ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలు అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి.

బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన గణేశ్​ నిమజ్జనం శోభాయాత్ర రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించమని పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను సోమవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​లోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్న‌ గరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్​నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాలను మళ్లిస్తామని తెలిపారు.

ట్రాఫిక్​ ఆంక్షలు:

గణేశ్ నిమజ్జన సమయంలో పలు ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులకు ఆంక్షలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్ ట్యాంక్ వద్ద నిలిపివేస్తారు. కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వద్ద, సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు సీటీఓ ప్లాజా, ఎస్‌బీహెచ్‌, క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్‌ రోడ్ వరకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తారు.

గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్‌ వైపు వచ్చే వాహనాలు దిల్​సుఖ్​నగర్ వద్ద, మిధాని, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు ఐఎస్‌ సదన్ వద్ద, ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులు వైపీఎంఏ నారాయణ గూడ వద్ద నిలిపివేస్తామని పోలీసులు వివరించారు.

ఎంజీబీఎస్‌ నుంచి అంతరాష్ట్రతోపాటు వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులకు కోసం ప్రత్యేక రూట్ మ్యాప్​ను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. రాజీవ్ రహదారి నుంచి వచ్చే వాహనాలను జేబీఎస్‌ వరకు, సంగీత్, తార్నాక, విద్యానగర్ టీ జంక్షన్‌, ఫివర్ ఆస్పత్రి, బర్కత్ పూర్, నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు.

బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలతోపాటు ముంబై ఎన్‌హెచ్‌ 9 నుంచి వచ్చే వాహనాలు వై జంక్షన్ బోయిన్​పల్లి వైసీఎంఏ సంగీత్, తార్నాక, విద్యానగర్ టీ జంక్షన్‌, ఫివర్ ఆస్పత్రి, బర్కత్​పూర్ నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌ వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

గణేశ్​ శోభాయాత్రలో కలిసే రహదారులు: ప్రధాన శోభాయాత్ర బాలాపూర్‌ కట్టమైసమ్మ టెంపుల్, కేశవగిరి, చాంద్రయణగుట్ట, మహబూబ్​నగర్ ఎక్స్ రోడ్‌, ఆలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదినా, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, లిబర్టి, అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ మార్గ్​లో కలుస్తుందని అధికారులు తెలిపారు. సికింద్రబాద్ నుంచి వచ్చే గణేశ్​ విగ్రహాలు సంగీత్, ప్యాట్ని, పారడైజ్, ఎంజీ రోడ్, రాణిగంజ్‌, కర్బాలామైదానం, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తాయని పోలీసులు తెలిపారు.

ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు రామాంతపూర్, తిలక్ నగర్, శివం రోడ్‌, విద్యానగర్ టీ జంక్షన్, నారాయణ గూడ మీదుగా ఆర్టీసీ క్రాస్​రోడ్ వైపు వచ్చే శోభాయాత్రలో కలుస్తాయని అధికారులు తెలిపారు. టోలి చౌకి, రేతి బౌలి, మెహిదీపట్నం నుంచి వచ్చే గణేశ్​ విగ్రహాలను మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్‌, ద్వారకా హోటల్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తాయని చెప్పారు. ఎస్‌ఆర్ నగర్, అమీర్​పేట్​, పంజాగుట్ట నుంచి వచ్చే విగ్రహాలను మెహదీపట్నం వైపు నుంచి వచ్చి శోభాయాత్రలో కలుస్తాయని వివరించారు.

ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్లు: మరోవైపు నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్సపోర్టు వినియోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని అధికారులు సూచించారు. ఎలాంటి అసౌర్యం కలగుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం వచ్చే వారు, వీక్షించేందు వచ్చే ప్రజలు ఎలాంటి అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్లు 9010203626, 8712660600, 040-27852482కి ఫోన్ చేయొచ్చని పోలీసులు తెలిపారు.