ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జామ్స్… 30 తేదీతో పూర్తికానున్నాయి. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. చివరిరోజు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షతో అన్ని పేపర్లు ముగుస్తాయి.
విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.
విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. తుది కీ విడుదల చేసిన మరో ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. అంటే ఆగస్టు నాటికి డీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీలను విడుదల చేసే విషయం లేదా అభ్యంతరాలను పరిశీలించే విషయంలో ఒకటి రెండు ఆలస్యమైతే…. ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.
ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక… సబ్జెక్టుల వారీగా హాజరైన అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.
ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేశారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.