AP Inter Reforms: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం.. మ్యాథ్స్‌లో ఒకే పేపర్‌,బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్ట్-key reforms in ap intermediate education underway single paper in maths single subject in botanyzoology ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Reforms: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం.. మ్యాథ్స్‌లో ఒకే పేపర్‌,బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్ట్

AP Inter Reforms: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం.. మ్యాథ్స్‌లో ఒకే పేపర్‌,బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్ట్

Sarath Chandra.B HT Telugu
Published Mar 14, 2025 04:00 AM IST

AP Inter Reforms: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోధనలో కీలక సంస్కరణలకు బోర్డు అమోదం తెలిపింది. ఇంటర్మీయట్‌లో ప్రస్తుతం ఉన్న మ్యాథ్య్ ఎ-బిలు ఇకపై ఒకే సబ్జెక్టుగా, బాటనీ-జువాలజీలను ఒకే సబ్జెక్టుగా బోధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ తరగతులు మొదలవుతాయి.

ఇంటర్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు బోర్డు అమోదం
ఇంటర్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు బోర్డు అమోదం

AP Inter Reforms: ఇంటర్‌ విద్యా బోధనలో కీలక సంస్కరణలో ఏపీ ఇంటర్ బోర్డు అమోదం తెలిపింది. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఇంటర్మీడియట్ లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజిలవైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజిల విద్యార్థులను తయారుచేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్ లో మార్పులు చేపట్టారు.

ఏప్రిల్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం…

ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ఇంటర్‌ జూన్ 1వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి. జూన్ 1 వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్‌లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు.

అదనపు సబ్జెక్టుల ఎంపికకు అవకాశం…

ఇంటర్‌ లో చేరే విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి, బహుళవిభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.

జూనియర్ కళాశాలల్లో ఎంబైపిసి ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్ కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎం.బైపిసి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి.

ఆ సబ్జెక్టుల విలీనం..

ఇంటర్మీడియట్ లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు. అలాగే బైపిసి విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది.

ఈఏపిసెట్, జెఇఇ, నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారు.

విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు…

కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాలప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు), ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా కొశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు.

NSQF స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, NSQF స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్‌ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు.

వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికాశుక్లా, పాఠశాల విద్య డైరక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాస్ రావు, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరక్టర్ జి.గణేష్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, పాల్గొన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం