ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమాదానికి గురై…. సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కింద పడే సింగయ్య మృతి చెందినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లు అయింది.
వైఎస్ జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైఎస్ జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది” అని దుయ్యబట్టారు.
తాజా పరిణామాలపై వైసీపీ స్పందించింది. కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రకు దిగిందని ఆరోపిస్తోంది. పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా… ప్రజలను మళ్లించే వ్యూహాలు, సంచలనాత్మక ప్రచారాలు, అబద్ధాల ప్రచారాలకు పాల్పడుతూనే ఉందని విమర్శించింది.
“పల్నాడు పర్యటనలో చీలి సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించడం దురదృష్టకరం. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రమాదం వార్త అందిన వెంటనే… ప్రత్తిపాడు YSRCP ఇన్‌చార్జ్ కిరణ్ కుమార్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని, పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వారికి పూర్తి మద్దతు తెలిపారు. ఆ రోజు తరువాత పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వ్యక్తిగతంగా కుటుంబాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మరుసటి రోజు జిల్లాకు చెందిన మరికొందరు నేతలు పరామర్శించి రూ. 10 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు” అని వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
"ప్రమాదానికి గురైన వాహనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌లో భాగం కాదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్రైవేట్ వాహనం అని చెప్పారు. డ్రైవర్ మరియు యజమానిని గుర్తించి విచారించగా…. ప్రమాదానికి కాన్వాయ్‌తో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ… సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఒక వీడియోను బయటికి తీసుకువచ్చారు. ఈరోజు వైరల్ అయిన వీడియోలో కాన్వాయ్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదు. Z+ భద్రతా రక్షకుడికి రోప్ పార్టీ మరియు రోడ్ క్లియరెన్స్ బృందం కాన్వాయ్‌కు నాయకత్వం వహించాలి. అయితే ప్రస్తుత ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైంది. ఫలితంగా పదేపదే లోపాలు జరుగుతున్నాయి" అని స్పష్టం చేసింది.