ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో గోవిందప్పి ఏ33గా ఉన్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది.
విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ ఆఫీసులవో గత ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి నోటీసులు అందజేశింది.
ఈ ముగ్గురు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు హాజరుకాలేదు. దీంతో వీరికోసం గాలింపు చేపట్టిన సిట్ అధికారులు గోవిందప్ప మైసూరులో ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి మంగళవారం అరెస్ట్ చేశారు. గోవిందప్ప అరెస్టుతో ఈ కేసులో ఇప్పటికి వరకూ ఐదుగురిని అరెస్టు చేశారు. గోవిందప్పను మైసూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
అయితే గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది.
మాజీ సీఎం జగన్‌కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి చాలా సన్నిహితులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని సిట్ ఆరోపిస్తుంది.
ముడుపులు చెల్లింపుల వ్యవహారంపై ఈ ముగ్గురూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో తరచూ సమావేశమయ్యేవారని సిట్ నిర్థారించింది.
లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి... కంపెనీల నుంచి ముడుపుల సొమ్మును ఈ ముగ్గురికి చేరవేస్తే దాన్ని వీరు జగన్‌కు అందజేసేవారని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురి పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు.
ఈ ముగ్గురి ఆదేశాలతోనే డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఈ ముగ్గురి పేర్లు మెమోలో సిట్ అధికారులు చేర్చారు.
సంబంధిత కథనం