Kesineni Nani: పాలిటిక్స్‌లో కేశినేని నాని రీ ఎంట్రీ, లేదంటున్నా వీడని అనుమానాలు, బీజేపీలో చేరుతారని ప్రచారం-kesineni nanis re entry into politics but doubts remain ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kesineni Nani: పాలిటిక్స్‌లో కేశినేని నాని రీ ఎంట్రీ, లేదంటున్నా వీడని అనుమానాలు, బీజేపీలో చేరుతారని ప్రచారం

Kesineni Nani: పాలిటిక్స్‌లో కేశినేని నాని రీ ఎంట్రీ, లేదంటున్నా వీడని అనుమానాలు, బీజేపీలో చేరుతారని ప్రచారం

Sarath Chandra.B HT Telugu
Published Feb 17, 2025 11:28 AM IST

Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మీళ్లీ రాజకీయాల్లోకిి రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన నాని,సొంత తమ్ముడు చిన్ని చేతుల్లో పరాజయం పాలయ్యాడు.ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా తాజాగా బీజేపీలో చేరతారని ప్రచారమవుతోంది.

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని

Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కక పోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని తమ్ముడి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. గత ఏడాది జూన్‌ 10న ఇక రాజకీయాల్లోకి రానని చెప్పారు.

కొంత కాలంగా కేశినేని నాని బీజేపీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వంటి వారితో ఉన్న సంబంధాల నేపథ్యంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం మొదలైంది. కేశినేని నానితో పాటు ఆ‍యన కుమార్తె కూడా విజయవాడలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా, కుమార్తెకు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారా అనే దాంట్లో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానంతో విభేదాలు వచ్చాయి. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహార శైలి సాగింది. 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్టైన సమయంలో ఢిల్లీలో లోకేష్‌ వెంట నడిచారు. ఆ సమయంలో వివాదాలు సమసిపోయాయని భావించిన ఆ తర్వాత కేశినేని నానికి పొగబెట్టారు. విజయవాడ ఎంపీ టిక్కెట్‌ చిన్నికి ఖరారు కావడంతో ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీజేపీ వైపు అడుగులు…

టీడీప తరపున రెండుసార్లు విజయవాడ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కేశినేని నాని మొదట్నుంచి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. వైసీపీని వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో చర్చలు జరిపినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేశినేని బీజేపీలో చేరుతారంటూ కొద్ది రోజులుగా విజయవాడలో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 6వ తేదీన నందిగామ మండలం బిళ్లనపాడులో జరిగిన ఆంతరంగిక సమావేశంలో కేశినేని చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం మొదలైంది.

రతన్‌ టాటాతో పాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీల స్ఫూర్తితో పనిచేసినట్టు కేశినేని నాని చెప్పుకొచ్చారు. గడ్కరీతో ఉన్న పరిచయం కారణంగా విజయవాడ నగర అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చానని అందులో చెప్పుకొచ్చారు. బిళ్లనపాడు తర్వాత గొల్లపూడి, తిరువూరులో కూడా కేశినేని శ్రీనివాస్‌ తన వర్గంతో సమావేశాలు నిర్వహించారు. శనివారం కూడా విజయవాడలో తన వర్గం నేతలతో మంతనాలు చేయడంతో బీజేపీలో చేరిక లాంఛనమేనని కేశినేని అనుచరులు చెప్పుకొచ్చారు.

లేదు లేదంటూనే…

గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాననని ఆ నిర్ణయం మారదని కేశినేని నాని ఎక్స్‌లో పోస్ట్‌ చేవారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నమ్ముతున్నానని, ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని వివరించారు.

విజయవాడలోని పౌరుల శ్రేయస్సు కోసం లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు. రాజకీయ పునరాగమనానికి సంబంధించి నిరాధారమైన వార్తలను విస్మరించాలన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందని వివరించారు.మరోవైపు కేశినేని అనుచరులు మాత్రం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. తమ్ముడి మీద పంతం కోసమైనా నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుచరులు భావిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం