Kannada Dictionary: ఆంధ్రా బాటలో కర్ణాటక.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుభాషా డిక్షనరీల పంపిణీ
Kannada Dictionary: విద్యా రంగ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ అనుసరించిన విధానాలను కర్ణాటక కూడా అనుసరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు, కన్నడ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకునేందుకు వీలుగా బహుభాషా డిక్షనరీలను విడుదల చేశారు.
Kannada Dictionary: కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు బహు భాషా నిఘంటువు (బై-లింగువల్ డిక్షనరీ) విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా కర్ణాటకలో విద్యా విధానంలో ఈ డిక్షనరీలను పంపిణీ చేయనున్నారు. నాలుగేళ్ల క్రితమే ఏపీలో తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఆక్స్‌ఫర్డ్ సహకారంతో రూపొందించిన డిక్షనరీలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం ప్రారంభింది. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. కన్నడ-ఇంగ్లీష్ డిక్షనరీ విడుదలలో ఏపీ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాల కృష్ణ పాల్గొన్నారు.
కర్ణాటక సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, బాల్ రక్షా భారత్ -సేవ్ ది చిల్డ్రన్ సాంకేతిక భాగస్వామ్యంతో కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు కన్నడ- ఆంగ్ల భాషలో ప్రావీణ్యతను పెంపొందించడానికి ద్విభాషా నిఘంటువును రూపొందించారు.
ఈ డిక్షనరీని బుధవారం బెంగళూరులోని డిఎస్ఈఆర్టీ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కర్ణాటకలో 1-5 తరగతులకు, 6-8 తరగతులకు పాఠ్య పుస్తకాల ఆధారంగా వేర్వేరుగా కన్నడ - ఆంగ్ల భాషాల డిక్షనరీలు రూపొందించినట్టు కర్ణాటక విద్యాశాఖ అధికారులు వివరించారు.
డిక్షనరీ రూపకల్పనలో కఠిన పదాలను, వ్యాకరణం, పదాల ఉచ్ఛారణ వంటి వాటిని పరిగణనలోనికి తీసుకున్నామని అన్నారు. తద్వారా విద్యార్థులు సులువుగా నేర్చుకోవడం, వాక్యాలను రూపొందించడం, చదవడం వల్ల కన్నడ -ఆంగ్ల బహు భాషల్లో ప్రావీణ్యత సాధించిగలరని అన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులకు అందిస్తున్న బహుభాసా పుస్తకాలు, డిక్షనరీలు పరిశీలించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ స్ఫూర్తితో ఈ నిఘంటువు రూపొందించామని ప్రశంసించారు.
కన్నడ- ఇంగ్లీష్ డిక్షనరీల రూపకల్పనలో బాల్ రక్షా భారత్ సాంకేతికతను అందించగా, డీఎస్ఈఆర్టీ (కర్ణాటక) సంస్థ సబ్జెక్టు నిపుణులు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది శ్రమించి రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు శ్రీనివాసరావు వర్చువల్ గా పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ బై-లింగువల్ డిక్షనరీ మరియు బైలింగువల్ పాఠ్య పుస్తకాలను అందించడం ద్వారా ఏపీలో విద్యార్థులకు కలిగిన ప్రయోజనాలను, అనుభవాలను వివరించారు. డిక్షనరీలను రూపొందించిన డీఎస్ఈఆర్టీ, బాల్ రక్షా భారత్ సంస్థలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు రూపొందించి విద్యార్థుల్లో మరింత భాషా ప్రావీణ్యం పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యాభివృద్ధికి ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ, తరగతి వారీ అభ్యసనా సామర్థ్యాలు సాధించడానికి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం మరియు స్టెమ్ ఆధారిత విద్యను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
బాల్ రక్షా భారత్ కూడా తమకు సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నమూనా ద్వారా కర్ణాటకలో కూడా 1-8 తరగతి వరకు బహుభాషా నిఘంటువును తయారుచేసి పిల్లలకు అందించడం పిల్లలకు భాషాభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ఏపీలో విద్యార్థులకు ఆంగ్లంలో విద్యా బోధన, ఆంగ్లం-తెలుగులో పాఠ్య పుస్తకాలను అందించడం, విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన, విద్యార్థులకు డిక్షనరీలను అందుబాటులోకి తీసుకురావడం వంటి విద్యారంగ సంస్కరణలను వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో సమానంగా ఆంగ్లంలో పట్టు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల్ని చేపట్టారు. తాజాగా కర్ణాటకలో కూడా విద్యార్థులకు ఇంగ్లీష్-కన్నడ డిక్షనరీల రూపొందించి ఉచితంగా అందించాలని నిర్ణయించారు.