Kakinada Robbery : ఒంటరి మహిళలే టార్గెట్, చందా కోసం వచ్చి మత్తు మందు చల్లి చోరీలు
Kakinada Robbery : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుని చోరీలకు పాల్పడుతున్నాడో ఘనుడు. చందా కోసం అని వచ్చి మత్తు మందు చల్లి ఇల్లు గుల్ల చేసి పరారవుతున్నాడు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒంటరి మహిళలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని సేవ పేరుతో తలుపుకొడతాడు, తలుపు తీసిన తరువాత మత్తు మందు చల్లి, ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులు దోచుకుంటాడు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చందా కోసమని వచ్చి మత్తు మందు చల్లి, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బులతో ఉడాయించాడో కేటుగాడు.
కాకినాడలోని సినిమా రోడ్డు, నెల్లి అప్పన్న సెంటర్‌లోని ఒక భవనంలో పోతుల నాగేశ్వరరావు, భార్య మంజశ్రీ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. దసరా సెలవుల కారణంగా పిల్లలు బంధువుల ఇంటికి, భర్త వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం మంజశ్రీ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. టోపీ, మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు. స్వచ్ఛంద సేవాసంస్థకు చందా అడిగాడు. లేవని చెప్పడంతో దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్లు అడిగాడు.
మంచినీళ్లు తెచ్చేందుకు ఆమె లోపలకు వెళ్లగా మత్తుమందు చల్లాడు. ఆమె పడిపోవడంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు బీరువాలోని ఆభరణాలు, వస్తువులు చోరీ చేశాడు. 50 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, నగదు చోరీ చేశాడు. ఆమె శుక్రవారం పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలు
శ్రీకాకుళం జిల్లాలో ఒంటిరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలు చేసిన నలుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ.7.70 లక్షల విలువైన 11 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, కాశీబుగ్గలో రెండు గొలుసు దొంగతనాలు జరిగాయి. వాటికి సంబంధించిన కేసులను పోలీసులు చేధించారు. కాశీబుగ్గకు సంబంధించిన రెండు కేసుల్లో సుమారు రూ.7.70 లక్షలు విలువైన 11 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోంపేట కేసులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఒడిశా రాష్ట్రం బరంపురంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టులో ఉన్నాయి. వాటిని రికవరీ చేసేందుకు నోటీసులిచ్చనట్లు పోలీసులు తెలిపారు.
రాజగోపాల్ అనే వ్యక్తి ముందుగా రెక్కీ నిర్వహించి, ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, మహిళల ఇళ్లలో కిరణ్, ఉమామహేశ్వరరావుతో కలిసి చోరీలు చేస్తున్నారు. రాజగోపాల్, కిరణ్ తండ్రీ కొడుకులు. మెళియాపుట్టికి చెందిన ఉమామహేశ్వరరావుపై గతంలోనూ కేసులున్నాయి. వీరికి ఓ మహిళ కూడా సాయపడేది. ఈ కేసులను ఛేదించేందుకు సీఐలు డి. మోహన్‌రావు, మంగరాజు, ఎస్ఐ హైమవతి, కీలకంగా వ్యవహరించారు. పట్టుకున్న దొంగలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు శుక్రవారం మీడియా ముందు ఉంచారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం